నాడు ఓ వెలుగు వెలిగిన సంప్రదాయ డిగ్రీ కోర్సులు.. నేడు ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు అడ్మిషన్ల కోసం పోటీపడి ప్రచారం చేసిన కళాశాలలు.. ప్రస్తుతం చడీచప్పుడు లేకుండా పోయాయి. కొన్నేళ్ల క్రితం వరకూ.. డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ వచ్చిందంటే ఏ కళాశాల ఎంపిక చేసుకోవాలోననుకుంటూ విద్యార్థులు ఆరా తీసేవారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైంది. అసలు నోటిఫికేషన్ వచ్చిందనే ఆలోచనలోనే విద్యార్థులు లేకుండా పోయారంటే అతిశయోక్తి కాదు.
ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు వెనుకడుగు వేస్తున్నారు. రీయింబర్స్మెంట్ రాకపోవడం, ఫలితంగా నిర్వహణ భారం కావడం వంటి కారణాలతో ప్రైవేటు కళాశాలలు కూడా భారంగా నెట్టుకొస్తున్నాయి. కొన్ని కళాశాలలు మూసివేతకు సిద్ధపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో డిగ్రీ కాలేజీల పరిస్థితి దయనీయంగా మారింది. రీయింబర్స్మెంట్ హామీల అమలు సహా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల నియామకాల వరకూ ఏ ఒక్కదానినీ పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఇక ప్రవేశాలపై శ్రద్ధను పక్కనపెట్టింది. ఇదిలా ఉంటే.. దోస్త్ మొదటి విడతకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 21తో గడువు ముగియనుంది.
నాడు భళా.. నేడు డీలా..
కొన్నేళ్ల క్రితం వరకూ ఖమ్మం జిల్లాలో డిగ్రీ విద్య అద్భుతంగా సాగింది. ఇంజినీరింగ్ వంటి వృత్తివిద్యా కోర్సులకు క్రేజ్ ఉన్నప్పటికీ డిగ్రీ విద్య ఏమాత్రం మసకబారలేదు. గత ప్రభుత్వం అన్ని కోర్సులకూ ప్రోత్సాహం అందించడంతో డిగ్రీ విద్య స్థిరంగా కొనసాగింది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి డిగ్రీ విద్య గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటోంది. చివరికి ఇచ్చిన హామీ మేరకు ప్రైవేటు కాలేజీలకు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించలేదు.
దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అవి అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నాయి. నిరసన వ్యక్తం చేస్తూ ఏకంగా కళాశాలలను కొన్ని రోజులపాటు మూసివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాము అధికారంలోకి రాగానే రీయింబర్స్మెంట్స్ను చెల్లిస్తామంటూ పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ ప్రభుత్వం.. ఆ హామీని తుంగలో తొక్కింది. ‘బకాయిలు చెల్లించి మమ్ములను ఆదుకోండి మహాప్రభో..’ అంటూ గడిచిన ఏడాదిన్నరగా మొరపెట్టుకున్నా ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడడం లేదు.
దీంతో కళాశాలల యజమానులను నిస్సత్తువ ఆవహించింది. దీంతో బోధనలో అవి నాణ్యతను తగ్గించడంతో విద్యార్థులు అనాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా డిగ్రీ విద్య డోలాయమానంలో పడింది. గత నెలలో జరగాల్సిన పరీక్షలను ‘మేం నిర్వహించలేం’ అంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కరాకండీగా చెప్పాయి. దీంతో దిక్కుతోచక ప్రభుత్వమే పరీక్షలను వాయిదా వేసుకుంది. అలా వాయిదా పడుతూ వచ్చిన పరీక్షలు ఇప్పుడు సాగుతున్న దుస్థితి ఏర్పడింది.
ప్రచారం వైపు కన్నెత్తి చూడని కళాశాలలు..
డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రైవేట్ కళాశాలలు మొన్నటి వరకూ పోటీ పడేవి. ఏకంగా విద్యార్థులకు తాయిలాలు కూడా అందించేవి. కానీ.. ప్రస్తుతం జిల్లాలోని ఏ ప్రైవేట్ కళాశాల కూడా ప్రచారం వైపు కన్నెత్తి చూడడం లేదు. తాయిలాల ఊసే ఎత్తడం లేదు. కొన్ని కళాశాలలైతే.. ‘ఉన్నాయో లేవో’ అనే పరిస్థితి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన డిగ్రీ కళాశాలలు ఇప్పుడు డిగ్రీ కోర్సులను మూతవేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒకటి రెండు మినహా మిగిలిన కళాశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య రెండు అంకెల్లో ఉంటోంది. అధ్యాపకుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో ఒకటి, రెండు ప్రభుత్వ కళాశాలల్లో మినహా అత్యధిక కళాశాలల్లో ఎక్కువ శాతం అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా అతిథి అధ్యాపకులతోనే నెట్టుకొస్తోంది.
రేపటితో మొదటి విడత దోస్త్ గడువు పూర్తి..
దోస్త్ మొదటి విడత ద్వారా డిగ్రీలో చేరేందుకు ఈ నెల 21 చివరి రోజు. ఈ నెల 22 ఆప్షన్స్ ఇవ్వడానికి ఆఖరి రోజు. ఈ నెల 30 నుంచి జూన్ 9 వరకు రెండో విడత ఉన్నప్పటికీ చాలా కళాశాలల్లో మొదటి విడతలోనే ఆయా కళాశాలల్లో ఎంత మంది విద్యార్థులు చేరుతారనేది స్పష్టమవుతుంది. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ అటానమస్ డిగ్రీ కళాశాల మినహా మిగిలిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు రాని పరిస్థితి. ఖమ్మం నగరంలో 11 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలుంటే ఈ విద్యాసంవత్సరం నాలుగు కళాశాలలు మూతపడనున్నాయి. కొన్ని కళాశాలలైతే తప్పనిసరి పరిస్థితుల్లోనే కొనసాగిస్తున్నారు.
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో గతంలో మొదటి సంవత్సరంలో 500 అడ్మిషన్లు పొందిన కళాశాలల్లో గత సంవత్సరం 150 మంది చేరడం గగనంగా మారిందంటే అతిశయోక్తి లేదు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరంలో మూడు విడతల్లో, స్పెషల్ ఫేజ్లో కలిపి చేరిన విద్యార్థుల వివరాలు..
Jj