భద్రాద్రి కొత్తగూడెం/ రఘునాథపాలెం/ కరకగూడెం/ పెనుబల్లి, మే 21 (నమస్తే తెలంగాణ) : ఎండలు మండిపోతున్నాయ్.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జనం ఉదయం ఏడు గంటలకే ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. సాయంత్రం ఏడుగంటల వరకు వేడిగాలులు తగ్గడం లేదు. పని ప్రదేశాల నుంచి కూలీలు పదిగంటలకే ఇంటిముఖం పడుతున్నారు. నెత్తిన టవల్ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి.
చిరువ్యాపారులు ఎండకు తట్టుకోలేక తోపుడు బండ్లపైన దుప్పట్లు కట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మధ్యాహ్నం నుంచి ఇంటిముఖం పడుతున్నారు. పొట్టకూటి కోసం నాలుగు పండ్లు అమ్ముకొని, బతికుంటే బలుసాకు తినొచ్చు అన్నట్లు ఎండకు తట్టుకోలేక ఇంటికి చెక్కేస్తున్నారు. జనం దూపకు తట్టుకోలేక బయటకు వచ్చిన రెండు నిమిషాల్లోనే శీతల పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు. నెత్తిన నెగడు పెట్టినట్లుగా ఉండటంతో వడదెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. కొంతమంది వడదెబ్బకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దంచికొడుతున్న ఎండలతో జనం బేజారవుతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత దంచి కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సింగరేణి ప్రాంతాల్లో 45 వరకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో కార్మికులు ఎండకు తట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగినా వేడి తాపం నుంచి కాపాడుకోలేకపోతున్నారు.
ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, కొత్తగూడెం కార్మిక ప్రాంతాల్లో మరింత వడగాలులు వీస్తున్నాయి. ఖమ్మం నగరంలోని ప్రధాన వీధులన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోడ్లపై జన సంచారం పూర్తిగా తగ్గిపోయింది. రోజువారీగా రద్దీగా కనిపించే ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్లు సైతం వెలవెలబోయి కనిపిస్తున్నాయి.
దంచి కొడుతున్న ఎండలతో చిన్నారులు, వృద్ధులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు పలువురు వడదెబ్బ బారిన పడుతున్నట్లు సమాచారం. కొందరు వృద్ధులైతే తట్టుకోలేక అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఎక్కువగా జనం రోజంతా ఇళ్లకే పరిమితం కావడంతో కూలర్లు, ఏసీల వినియోగం పెరిగి విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఎవరి నోట విన్నా ఎండల తీవ్రత గురించి చర్చించుకోవడమే కనిపిస్తోంది.
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, డాక్టర్లు చెబుతున్నారు. అవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు 4-5 లీటర్ల నీళ్లు తాగాలని, పండ్ల రసాలు, మజ్జిగ వంటిని సేవించాలని సూచనలు ఇస్తున్నారు. బొగ్గు బావుల వద్ద కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినా అది నామమాత్రమే అని చెప్పాలి. నీళ్లు ఎన్ని తాగినా దూప తగ్గకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు.

చిన్నపిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆసుపత్రుల్లో చంటిపిల్లలు, తల్లులు అల్లాడిపోతున్నారు. రామవరం మాతా, శిశు వార్డుల్లో రోగులు ఉండలేక ఆరుబయటకు వచ్చేస్తున్నారు. ఇక మూడ్రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభమైతే జనం ఇంటికే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉపాధి కూలీలు పనులు చేయలేక పదిగంటలకే ఇంటిముఖం పడుతున్నారు.
ఇన్నేళ్లలో ఇలాంటి ఎండలు ఎప్పడూ చూడలేదు. రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదవుతుండటంతో బయటకు రావాలంటే భయమేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తల, చెవులకు రుమాలు చుట్టుకొని వెళ్తున్నాం. వృద్ధులు, చిన్నారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. భూమి వేడి తాపం రాత్రి 10 గంటలకు వరకు కూడా తగ్గడం లేదు.
-సిద్ధి నునీల్, కరకగూడెం
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎండలో ఎక్కువగా తిరిగితే శరీరంలో తేమ శాతం తగ్గి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. అత్యవసర పనులు ఉంటేనే బయటకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని వెళ్లాలి. లేదంటే ఇంటికే పరిమితమైతే మంచిది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తలకు రుమాలు, కళ్లద్దాలు ధరించి బయటకు వెళ్లాలి. ఎండలో తిరిగిన వారికి వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందాలి.
-డాక్టర్ రవితేజ, పీహెచ్సీ వైద్యాధికారి, కరకగూడెం