రఘునాథపాలెం, జూలై 27: అధికారం అండతో ఆ పార్టీ నాయకులు.. పేద గిరిజన రైతులకు చెందిన రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిపై కన్నేశారు. సదరు గిరిజన రైతులకు, వారి పొరుగు రైతుకు మధ్య ఉన్న పోరును ఆయుధంగా చేసుకున్నారు. ఆ తరువాత వీరి అధికార బలాన్ని ఉపయోగించి వక్రమార్గంలో ఆ పేద గిరిజన రైతుల భూమిని కాజేశారు. ఆ తరువాత తమ పేరు మీదకు మార్చుకొని సక్రమమంటూ దబాయింపులకు దిగారు. అనంతరం ప్లాట్లుగా చేసి అమ్మకానికి పెట్టారు. ఆఖరికి విషయం తెలుసుకున్న బాధిత రైతులు బోరుమంటున్నారు. ఖమ్మంలోని కైకొండాయిగూడెంలో ఆదివారం వారు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు.
బాధిత గిరిజనులైన తేజావత్ మధు, మోతీలాల్, రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం కైకొండాయిగూడేనికి చెందిన గిరిజన రైతు తేజావత్ మాన్సింగ్ (బాధితులు ఇతడి మనవళ్లు)కు కైకొండాయిగూడెం పరిధి మల్లెమడుగులోని సర్వే నంబర్ ‘296/అ6’లో 4.33 ఎకరాల భూమి ఉన్నది. మాన్సింగ్ మరణానంతరం ఆయన ఇద్దరు కుమారులైన బాలు, రాములు చేతికి వచ్చింది. వీరి మరణానంతరం వారి కుమారులైన బాధితులు మధు, మోతీలాల్, రాంబాబు (బీఆర్ఎస్ నాయకులు) సదరు భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పొరుగు రైతుతో బాధిత రైతులకు ఏర్పడిన వివాదాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు గమనించారు.
దీనిని అడ్డుపెట్టుకొని ఆ భూమిని కాజేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అదే సర్వే నంబరులో 27 కుంటల భూమి ఉన్న ఓ రైతును ఎంపిక చేసుకున్నారు. ఆ రైతుకు డబ్బు ఎర వేశారు. ఈ క్రమంలో మాన్సింగ్ పేరుతో ఉన్న 4.33 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారుల సహాయంతో 27 కుంటలు ఉన్న రైతుకు చెందిన సర్వే నంబరులో ఎక్కించారు. ఆ తరువాత ఒప్పందం మేరకు ఆ 27 కుంటల రైతుకు రూ.25 లక్షలు ఇచ్చారు. ఆ తరువాత మరో వ్యక్తి పేరు మీదికి ఆ భూమిని బదలాయించుకున్నారు.
ఆ వెంటనే దానిని ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టారు. ఆఖరికి విషయం తెలుసుకున్న బాధిత రైతులు వెంటనే వెళ్లి ప్రశ్నించారు. దీంతో సదరు అధికార పార్టీ నాయకులు రౌడీలతో బెదిరింపులకు పాల్పడ్డారు. భూమిపై పత్రాలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, మీరేమీ చేయలేరని స్పష్టం చేశారు. దీంతో బాధిత గిరిజన రైతులు లబోదిబోమన్నారు. కైకొండాయిగూడెంలో ఆదివారం విలేకరుల సమావేశంల పెట్టి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై కలెక్టర్ దృష్టి సారించి అక్రమ పద్ధతిలో రూ.కోట్ల విలువైన భూమిని కాజేసినన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.