భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : మండే ఎండల్లో ‘ఉపాధి కూలీలు’ విలవిలలాడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సిన ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. కూలీలకు కొత్త కొత్త రూల్స్ పెడుతున్నది తప్ప.. వారికి పనిప్రదేశంలో కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. పట్టించుకోవాల్సిన సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎండలో కష్టపడి పనిచేసినా రెక్కల కష్టానికి తగిన ప్రతిఫలం కూడా రావడంలేదని కూలీలు మరోపక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత పది రోజుల నుంచి ఎండల తీవ్రత పెరుగుతున్నా ఉపాధి కూలీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాలి కలగడం లేదు. తెల్లవారకముందే ఉపాధి పనులకు పోతున్న కూలీలు పని ప్రదేశంలో పొద్దుఎక్కేకొద్దీ ఎండను తట్టుకోలేక నరకం చూస్తున్నారు. అధికారులు మాత్రం చాలీచాలని టెంట్లు వేసి మొక్కుబడిగా సౌకర్యాలు కల్పించి కూలీల ఉసురు తీస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉపాధికూలీల పరిస్థితి దయనీయంగా ఉంది.
ఉదయం లేవగానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా ఉపాధి కూలీలకు మాత్రం పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. గుండాల మండలంలో చూస్తే అసలు ఇది టెంటేనా అనిపిస్తున్నది.. చినిగిపోయిన పాత పరదాను టెంటుగా వేసి చేతులు దులుపుకున్నారు. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో టెంట్లు వేశారు.. కానీ, తాగునీటి సౌకర్యం కల్పించలేదు. సడన్‌గా వడదెబ్బ తగిలితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో లేవు. తాగునీరు ఇవ్వాలనే నిబంధన ఉన్నా పంచాయతీ సిబ్బంది వారికి తాగునీరు ఇవ్వకపోవడం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో కూలీల అటెండెన్స్‌ను తప్పనిసరి చేయడంతో ఆన్లైన్ యాప్ వల్ల కూలీలకు తలనొప్పిగా మారింది. (ఎన్ఎంఎంఎస్) నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ అందుబాటులోకి తీసుకురావడంతో కూలీలకు నాలుగు గంటలకు రెండుసార్లు ఫొటో తీసి అటెండెన్స్ తీసుకోవాలి. దీంతో కూలీలకు ఫొటో యాప్‌లో యాడ్ కాకపోతే ఆ రోజు హాజరుపడదు.. దీంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేవలం ఒక్కసారే హాజరు తీసుకునే వారు.. ఈ వేసవిలో రెండుసార్లు హాజరు తీసుకోవడం వల్ల కూలీలకు ఇదో తలనొప్పిగా మారింది. రెండుసార్లు పద్ధతిని తీసేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
అకాల వర్షాలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల రైతులు కూడా ఉపాధి పనులకు వెళ్లాల్సి వస్తున్నది. దీంతో ఈ వేసవిలో ఉపాధి కూలీల సంఖ్య పెరిగినట్లేనని చెప్పుకోవచ్చు. 2024లో ఉపాధి కూలీల సంఖ్య 85 వేల మందికిపైగా ఉండగా.. 2025లో 55 వేలకు పడిపోయింది. ఈ ఏడాది 65 వేల మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. మండే ఎండల వల్ల పనిచేసే కూలీలు రాలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. ఎండలు తగ్గితే కూలీల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.
గతంలో లాగానే ఒక్కసారే ఫొటో తీయాలి. రెండుసార్లు తీయడం వల్ల చాలా టైం వేస్టు అవుతున్నది. ఫోన్లో సిగ్నల్ ఉండకపోతే నిమిషాలకొద్దీ ఫొటో వద్దనే ఉండాల్సి వస్తున్నది. కంటిరెప్పలు కొట్టకపోతే ఫొటో తీసుకోవడం లేదు. యాప్‌ల గోల ఏంటి అసలు. మామూలుగా హాజరు తీసుకోవాలి. కొత్త రూల్స్ పెడుతున్నారు.. కానీ, కూలీలకు కనీస సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు.
– షేక్ యాకూబ్, మహ్మద్‌నగర్, తిప్పనపల్లి, చండ్రుగొండ మండలం
ఏదో మొక్కుబడిగా టెంటు వేస్తున్నారు.. నీడ సరిపోవడం లేదు. టెంటు ఒకచోట ఉంటే.. పని మరోచోట ఉంటది.. వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టాలి. మజ్జిగ ఇస్తే వేడి నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది.. కానీ, అవేమీ ఇక్కడ ఉండవు. మండే ఎండలోనే పనిచేస్తున్నాం.. ఎండకు పనిచేయడం చాలా కష్టంగా ఉంది.
– కుప్పాల రమణ, ఉపాధి కూలీ, తిప్పనపల్లి, చండ్రుగొండ మండలం
ఉపాధిహామీ కూలీలకు గతంలో ఒక్కసారే హాజరు ఉండేది. ఇప్పుడు నిబంధనలు మారాయి. నాలుగు గంటల తర్వాత మళ్లీ ఫొటో తీయాలి. అక్రమాలు జరగకుండా కొత్త రూల్స్ పెట్టారు. కూలీలకు పని ప్రదేశాల్లో తప్పనిసరిగా టెంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉపాధి కూలీలకు కనీస ఏర్పాట్లు చేయని వారిపై చర్యలు తీసుకుంటున్నాం. మా సిబ్బంది ప్రతి రోజూ తనిఖీలు చేస్తున్నారు. పనుల వద్ద టెంట్లు తప్పనిసరిగా ఉండేలా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
– విద్యాచందన, డీఆర్డీఓ, భద్రాద్రి కొత్తగూడెం