మామిళ్లగూడెం, డిసెంబర్ 23 : 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు బాలమాయాదేవి అన్నారు. కలెక్టరేట్లో ఓటరు సవరణ జాబితా-2025పై ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డిలతో కలిసి అధికారులతో సోమవారం సమీక్షించారు. ఓటరు జాబితా సవరణ-2025పై జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి వివరించారు. అనంతరం పరిశీలకులు మాట్లాడుతూ ఓటరు జాబితాలో కొత్తగా నమోదవుతున్న వారి వివరాలను ర్యాండంగా చెక్ చేయాలని సూచించారు.
జాబితాకు సంబంధించి వచ్చిన ప్రతి అభ్యంతరం, క్లెయిమ్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ 2025 పూర్తి పారదర్శకంగా జరగాలని, ప్రతి కార్యక్రమంలో పార్టీల ప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ జిల్లాలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా సందర్భంగా ఫారం-6, 6ఏ, 7, 8 దరఖాస్తులు 21,274 రాగా.. ఇప్పటివరకు 18,192 దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. మరో 2,977 దరఖాస్తులు తిరస్కరించగా.. 105 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రత్యేక ప్రచారంలో జిల్లావ్యాప్తంగా 1,181 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సమావేశంలో డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీవోలు నర్సింహారావు, రాజేందర్, తహసీల్దార్లు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు స్వామి తదితరులు పాల్గొన్నారు.