ఖమ్మం, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి కేంద్రం ఎన్నికల సంఘం పోలింగ్‌ను ప్రారంభించనుంది. ఈసీ మార్గదర్శకాల మేరకు ఉదయం 6 గంటల నుంచే ఎన్నికల అధికారులు ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షణలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది తమ సామగ్రిని తీసుకొని ప్రత్యేక బస్సుల్లో ఆదివారం సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
ఖమ్మం పార్లమెంటు స్థానం పరిధిలో ఖమ్మం జిల్లాలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు, భద్రాద్రి జిల్లాలో రెండు సెగ్మెంట్లు ఉండగా వాటన్నింటినీలో సోమవారం పోలింగ్ జరుగనుంది. ఖమ్మం జిల్లాలో సాయంత్రం 6 గంటల వరకూ, మావోయిస్టు ప్రభావిత భద్రాద్రి జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. గత శాసనసభ ఎన్నికలకంటే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరగడంతో అందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను పెంచి వసతులను మెరుగు పరిచారు. ఖమ్మం పార్లమెంట్ బరిలో 35 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. ఇందులో నలుగురు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. మిగతా 31 మంది వివిధ రిజిస్టర్ పార్టీల అభ్యర్థులతోపాటు ఏ పార్టీలతోనూ సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థులు.
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1084 లోకేషన్లలో 1896 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో విధులు నిర్వహించేందుకు 7584 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 20 శాతం అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. 103 లోకేషన్లలో 230 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.
సమస్యాత్మక కేంద్రాల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వంద శాతం పోలింగ్ కేంద్రాల లోపల సీసీ కెమెరాలు అమర్చారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన 7034 బ్యాలెట్ యూనిట్లు, 2323 కంట్రోల్ యూనిట్లు, 2634 వీవీప్యాట్లు స్ట్రాంగ్ రూముల నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 16,31,039 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 7,87,160 మంది పురుషులు, 8,43,749 మంది మహిళలు, 130 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరంతో సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఓటరు స్లిప్పులు అందకపోయినప్పటికీ ఈసీ సూచించిన ఐదైనా గుర్తింపు కార్డు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని ఆర్వో, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈసీ మార్గదర్శకాలను ఎన్నికల సిబ్బంది తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించాలని కోరారు.
సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ సునీల్‌దత్ సూచించారు. జిల్లాలో పోలీంగ్ విధులకు 2391 మంది రాష్ట్ర, కేంద్ర బలగాల పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రత్యేకంగా గుర్తించిన 86 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ పక్రియ ముగిసిన అనంతరం ఈవీఎంలు తిరిగి స్ట్రాంగ్ రూములకు చేరే వరకు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని సీపీ ఆదేశించారు