మధిర, మే 02 : మూడు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మధిర ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆవుల సంతోశ్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు చెల్లించి, ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ జీతాలను మంజూరి చేసి ఉద్యోగులకు పే స్కేల్ ను త్వరగా ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బొల్లెద్దు విజయ్ కుమార్, రేలచర్ల అనిల్ కుమార్, వేల్పుల ముత్తయ్య, గుజ్జర్లపూడి శాంతయ్య, సుగ్గల గిరీశ్, అదరం సుజాత పాల్గొన్నారు.