భద్రాచలం, మే 18: సంస్కృతీ సంప్రదాయాలు, కట్టుబాట్లు అంతరించిపోకుండా కాపాడుకుంటూ వచ్చిన గిరిజనులు.. తమ మాతృభాషను రాబోయే తరాలకు అందించడానికి కృషిచేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ కోరారు. ప్రపంచ ప్రదర్శనశాల దినోత్సవం, కోయ వీరగాథ చక్రం ప్రదర్శన డాక్యుమెంటేషన్ ప్రారంభ సభలో భాగంగా భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
సమ్మక్క, సారలమ్మ, ఇలవేల్పులు బాపనమ్మ, చంద్రపాల వారసులు, రుద్రమదేవిల చరిత్రను వీరగాథలుగా మలిచి నేటితరం గిరిజనులకు తెలియచేయాలని సూచించారు. నేటితరం గిరిజన యువతీ యువకులకు భాష పట్ల సరిగా అవగాహన లేదని అన్నారు. దీంతో భాషపై మక్కువ కల్పించేలా ఐటీడీఏ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక దృష్టితో గిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేశామని, దానిని అధునాతనంగా తీర్చిదిద్దామని అన్నారు.
మ్యూజియం సందర్శనకు వచ్చే టూరిస్టుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. తాను కూడా పీవోగా ఇక్కడ బాధ్యతలు చేపట్టి పది నెలలు గడుస్తున్నాయని, ప్రధానంగా గిరిజన విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించానని అన్నారు. అనంతరం కోయ సంస్కృతీ సంప్రదాయాలకు చెందిన బుక్లెట్ను ఆవిష్కరించారు. తరువాత కులపతులను పీవో సత్కరించారు. గిరిజన కల్చర్ రీసెర్చ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమలరావు, కులపతులు బండ్ల మునీశ్వరరావు, బాపనయ్య, చుక్కమ్మ, సత్యం, రాంబాబు, మ్యూజియం ఇన్చార్జి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.