ఖమ్మం రూరల్, ఆగస్టు 28 : గడిచిన రెండు రోజులుగా ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక గ్రామాల్లో చెరువులు అలుగులు పోస్తున్నాయి. దీంతో పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం చెరువు పొంగి ప్రవహించడంతో ఆ ప్రభావం చెరువు దిగువన ఉన్న పలు కాలనీలపై పడింది. బుధవారం రాత్రి ఆకస్మికంగా వరద పెరగడంతో వరంగల్ క్రాస్ రోడ్డు సమీపంలోని శ్రీరామ్ నగర్, అయోధ్య నగర్ కాలనీలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఒక్కసారిగా ఇండ్లను వరద నీరు చుట్టుముట్టడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పటికే రాత్రి కావడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. స్థానిక నేతలు కొందరు సకాలంలో స్పందించి జేసీబీల సహాయంతో కాలువను తవ్వించి నీటిని బయటకు పంపే ప్రయత్నం చేశారు.
గురువారం ఉదయం వరకు సైతం కాలనీలలో వరద నీరు పొంగి ప్రవహించడంతో మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. జేసీబీల సహాయంతో ఎక్కడికి అక్కడ గండ్లు కొట్టించి వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. కాగా నెల రోజుల క్రితమే ఎదులాపురం చెరువుకు సంబంధించిన కాల్వ శుభ్రం పనులను మున్సిపాలిటీ చేపట్టింది. సుమారు రూ.10 లక్షల వ్యయంతో కాల్వ శుభ్రం చేసే పనులు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపించారు. కాల్వ ఆక్రమణకు గురి కావడంతోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని, ఇప్పటికైనా మున్సిపల్, సంబంధిత ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించి లోతట్టు ప్రాంత ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Khammam Rural : ఉప్పొంగిన ఎదులాపురం చెరువు.. కాలనీలను ముంచెత్తిన వరద నీరు