ఖమ్మం అర్బన్, మార్చి 20 : కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని కేయూ పీజీ కళాశాల ఎదుట సీఎం రేవంత్రెడ్డి, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్ధానాలు చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో 15 శాతం నిధులు ఇస్తామని ప్రకటించి.. బడ్జెట్లో కేవలం 7.57 శాతం మాత్రమే కేటాయించి నిరాశపరిచిందన్నారు. విద్యారంగం పట్ల తమకు వ్యతిరేక వైఖరి ఉంటుందనే సంకేతాలు ప్రభుత్వం ఇచ్చినట్లు బడ్జెట్ ఉన్నదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విద్యారంగానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వినయ్, భరత్, సాధిక్ పాల్గొన్నారు.