ఖమ్మం అర్బన్, మార్చి 17: ప్రభుత్వ పాఠశాలలకు విద్యాసంవత్సరం మొత్తంలో పలు అంశాలకు కేటాయించిన నిధులు.. వాటికి అనుగుణంగా ఖర్చు చేసి.. అందుకు సంబంధించిన యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్)లు అందజేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ సోమవారం ఆదేశించడంతో విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటివరకు చాలా స్కూళ్లలో గ్రాంట్స్‌ను ఖర్చు చేసిన దాఖలాలు లేకపోవడంతో తర్జనభర్జన పడుతున్నారు. అదనపు కలెక్టర్ ఆదేశాలతో ఏమి చేయాలో పాలుపోక విద్యాశాఖ అధికారులు జూమ్ మీటింగ్ నిర్వహించి పదిహేను రోజుల్లో నిధులు ఖర్చు చేయాలని, ఉన్నతాధికారులతో మాట రాకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. నిధులు కొన్నే ఖర్చు చేసినా పూర్తిస్థాయి యూసీలు అందజేయబోతున్నట్లు తెలుస్తున్నది.
పాఠశాల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రూ.12,500 నుంచి రూ.లక్ష వరకు రెండు విడతలుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. అయితే విద్యాసంవత్సరం మొదట్లో నిధులు లేక చాక్‌పీసులు కొనలేని పరిస్థితుల్లో పాఠశాలలను భారంగా నడపాల్సిన పరిస్థితి నెలకొంది. స్పోర్ట్స్ గ్రాంట్ ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, యూపీఎస్‌లకు రూ.10 వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.25 వేలు, సెల్ఫ్ డిఫెన్స్ గ్రాంట్ రూ.15 వేలు, సేఫ్టీ సెక్యూరిటీ గ్రాంట్ రూ.15 వేలు, బడిబాట నిధులు రూ.వెయ్యి, కాంప్లెక్స్ గ్రాంట్ రూ.33 వేలు, ఎంఆర్సీ గ్రాంట్ రూ.82,920, టెన్త్ స్నాక్స్ ప్రతి విద్యార్థికి రోజుకి రూ.15 చొప్పున 38 రోజులకు విడుదలయ్యాయి. యూత్ అండ్ ఎకో క్లబ్ నిర్వహణకు రూ.5 వేలు, రూ.3 వేలు, ఏక్ భారత్ శ్రేష్ట భారత్‌కు రూ.వెయ్యి చొప్పున నిధులు విడుదలయ్యాయి.
గ్రాంట్స్ ఖర్చులకు సంబంధించి యూసీలు, ఫొటోగ్రాఫ్లతో అందజేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఎంఈవోలను ఆదేశించారు. దీనిపై ఈ నెల 31వ తేదీలోగా పూర్తి నివేదిక పొందుపర్చాలని స్పష్టం చేశారు. నివేదిక అందజేయకపోతే సీరియస్‌గా పరిగణించనున్నట్లు హెచ్చరించారు. వెంటనే రంగంలోకి దిగిన విద్యాశాఖాధికారులు.. నిధులు ఎలా ఖర్చు చేయాలనే మార్గాలు అన్వేషించారు. ఒకవేళ ఖర్చు చేయకపోతే వాటిని డ్రా చేసి జూన్ నాటికి ఖర్చు చేస్తామని అండర్ టేకింగ్ అందజేయాలని సూచనలు చేశారు. అయితే దీనిపై కొందరు టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంవత్సరం మొదట్లో ఇవ్వాల్సిన గ్రాంట్ ఇప్పుడు ఇచ్చి ఖర్చు చేయాలని వెంటబడితే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. పరీక్షల వేళ విద్యార్థులను సన్నద్ధం చేసే పనిలో, పరీక్ష విధుల్లో ఉంటే ఇప్పుడు ఒత్తిడి తెస్తే ఎలా? అంటున్నారు.
జిల్లాలోని అత్యధిక స్కూళ్లలో క్రీడా పరికరాలు, ఆట వస్తువులు లేనే లేవు. నిధులు కేటాయించినా హెచ్ఎంలు ఇప్పటివరకు వాటిని కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. పీఈటీలు కొందామంటే కొన్ని ఇబ్బందులు, హెచ్ఎంలు కొంటే అనేక ఊహాగానాలు ఎదురయ్యాయి. దీంతో కొనుగోలు చేయలేదు. ఇలా పలు కారణాలతో అత్యధిక గ్రాంట్స్ అలానే ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ కేటాయించిన నిధులు సకాలంలో ఖర్చు చేయకపోతే మళ్లీ వెనక్కిపోతాయనే ఉద్దేశంతో ఖర్చు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కేజీబీవీకి రూ. లక్ష వరకు అందజేసే ఆలోచనలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ఉన్నారు. రూ.25 వేలు క్రీడా పరికరాల కోసం, మరో రూ.75 వేలు ఇతర అవసరాల కోసం.. అది కూడా ఈ నెల 31లోపు ఖర్చు చేసి వివరాలు అందజేయాల్సి ఉంటుంది. విద్యాశాఖపై అదనపు కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఎలాంటి వివరాలు అందజేస్తారో చూడాలి.