కూసుమంచి, సెప్టెంబర్ 3: వర్షాలు, వరదల కారణంగా పాలేరు జలాశయం చుట్టూ ఉన్న గ్రామాలు చిగురుటాకులా వణికి చెదిరిపోయాయి. సుమారు పదికి పైగా గ్రామాల్లోని ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ఉధృతి సోమ, మంగళవారాల్లో కాస్త తగ్గడంతో దాని తీవ్రత స్పష్టమవుతోంది. మినీ హైడెల్ ప్రాజెక్టు, మత్స్య పరిశోధనా కేంద్రం నీటమునిగాయి. వేలాది ఎకరాల వరి పంట నీటిపాలైంది. పలు రోడ్లు పూర్తిగా కొట్టుకొనిపోయాయి. ఎక్కడ చూసినా కొట్టుకొచ్చిన జేసీబీలు, ట్రాక్టర్లు, డోజర్లు, ఇతర వాహనాలు కన్పిస్తున్నాయి. ఆదివారం మునిగిన పెట్రోల్ పంపు సోమవారం కాస్త తేలి కన్పించింది.
పాలేరు రిజర్వాయర్ చరిత్రలో ఎన్నడూ రానంత వరద శని, ఆదివారాల్లో వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల్లో దెబ్బతినడంతో కర్షకులకు కొలుకోలేని పరిస్థితి ఏర్పడింది. పాలేరు పెద్ద కాలువకు రెండు చోట్ల గండ్లు పడ్డాయి. మినీ హైడెల్ ప్రాజెక్టులోని మోటర్లు పూర్తిగా నీటిలో మునిగాయి. 1.50 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు రావడంతో రోడ్లు, విద్యుత్ స్తంభాలు, మోటర్లు, ట్రాన్స్ఫార్మార్లు కొట్టుకుపోయాయి. వరద తగ్గడంతో నెమ్మదిగా ఇళ్లకు చేరుతున్న ప్రజలు తమ ఇళ్ల పరిస్థితి చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. కట్టుబట్టలు మినహా సర్వమూ కొట్టుకుపోవడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. పాలేరు, నానుతండా, హట్యాతండా, నాయకన్‌గూడెం, బెస్తబజారు, నర్సింహులగూడెం, జక్కేపల్లి, ఈశ్వరమాధారం, మంగలితండా తదితర గ్రామాల్లో వేలాది మందికి నష్టం జరిగింది.
నీట మునిగిన భక్తరామదాసు ప్రాజెక్టు..
పాలేరు నియోజకవర్గంలో 60 వేల ఎకరాలకు సాగు నీరందించే భక్తరాదాసు ఎత్తిపోతల పథకంలోని మోటర్లు నీటిలోనే మునిగి ఉన్నాయి. కోట్లాది రూపాయల నష్టం జరిగింది.
రాకపోకలకు అనుమతి..
సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిలో పాలేరు అలుగుల డౌన్ స్ట్రీమ్‌లో ఉన్న రహదారి బ్రిడ్జి దెబ్బతినడంతో రాకపోకలను వన్ వే లో అనుమతించారు. వాహనాలన్నీ కూసుమంచి నుంచి నేలకొండపల్లి రోడ్డులోకి వెళ్లి అక్కడి నుంచి హైవే మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. పాలేరు – నాయకన్‌గూడెం రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు బంద్ చేశారు. నర్సింహులడెం – పాలేరు, నర్సింహులగూడెం – కొత్తూరు, నర్సింహులలగూడెం – చౌటపల్లి, కిష్టాపురం – సీతారాంపురం, పెరికసింగారం – రాజుపేట, జక్కేపల్లి – చనుపల్లి సహా పలు గ్రామాల లింక్ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.