రఘునాథపాలెం, జనవరి 1: ప్రాణం కంటే విలువైనది జీవితంలో మరొకటి లేదని ఖమ్మం జిల్లా రవాణా శాఖ ఇన్చార్జి అధికారి (డీటీవో) వాకదాని వెంకటరమణ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఇన్చార్జి డీటీవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనాన్ని నడిపే సమయంలో నిర్లక్ష్యం వహిస్తే తనపై ఆధారపడిన కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుందని గుర్తుంచుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూనే వాహనాలు నడపాలని హితోపదేశం చేశారు. హెల్మెట్, సీటు బెల్ట్ వంటి రక్షణ కవచాలను నిత్యం తప్పక ధరించాలని సూచించారు. ఈ మాసోత్సవాల్లో ఏఎంవీఐ రెంటాల స్వర్ణలత, ఏవో జావెద్ అలీ, నూతన ఏఎంవీఐలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.