భద్రాద్రి కొత్తగూడెం, జూలై 9 (నమస్తే తెలంగాణ) : భూదార్ యూనిక్ నంబర్లు కేటాయించే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీ సర్వే చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో భూముల రీ సర్వే, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, సర్వేయర్ల శిక్షణ, సాంకేతిక ఏర్పాట్లపై సమీక్షించారు.
రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి, రీ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్ సాంకేతికతను వినియోగించి భూముల సరిహద్దులను కచ్చితంగా నిర్ధారించి, ప్రత్యేక గుర్తింపుగా భూదార్ యూనిక్ కేటాయిస్తామని చెప్పారు. రీ సర్వేకు ముందు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, రైతులు భూ యజమానులకు దీనిపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వీసీలో పాల్గొన్న కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో రీ సర్వేను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని చెప్పారు.