ఇల్లెందు/ చర్ల, మార్చి 17: బోర్లలో నీళ్లు లేకపోవడం, మిషన్ భగీరథ నీళ్లు నెల రోజులుగా రాకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పాతర్లగడ్డ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు సోమవారం ఖాళీ బిందెలతో రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఎండల తీవ్రతతో బోర్లలో నీరు ఇంకిపోయిందని, దీనికితోడు మిషన్ భగీరథ నీళ్లు కూడానెల రోజులుగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పంచాయతీ అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయడం లేదని, దీంతో తామే ఇంటికి కొంత జమ చేసి పంచాయతీ ట్యాంకర్‌తో నీళ్లు తెప్పించుకుంటున్నామని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి రోజూ తాగునీరు వచ్చేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
అలాగే, చర్ల మండలం ఆర్.కొత్తగూడెం పంచాయతీ ఎస్సీ కాలనీ వాసులు కూడా తాగునీటి కోసం రోడ్డెక్కారు. ఆర్.కొత్తగూడెం నుంచి ఇప్పటి వరకూ ఇస్తున్న మిషన్ భగీరథ నీళ్లు తమ కాలనీకి చేరుకోలేకపోతున్నాయని, అందుకని తమ ఇళ్లకు నీళ్లు సరఫరా కావడం లేదని, దీంతో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలో ప్రత్యేకంగా ట్యాంకు నిర్మించి తమకు సమృద్ధిగా నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖాళీ బిందెలతో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.