భద్రాద్రి కొత్తగూడెం, మే 3 (నమస్తే తెలంగాణ) : వేసవికాలం వచ్చిందంటే చాలు భద్రాద్రి కొత్తగూడెం ప్రజలకు శాపంగా మారుతున్నది. ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రతియేటా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. మంచినీళ్లు మహాప్రభో అంటూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురిస్తున్నది. ఒకచోట కాదు.. రెండుచోట్ల కాదు జిల్లాఅంతటా చాలా గ్రామాల్లో తాగునీరు సక్రమంగా రాకపోవడంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు.
ఒకవైపు గోదావరిలో కూడా నీరు అడుగంటడంతో మిషన్ భగీరథ మోటర్లకు సైతం నీరు అందడం లేదు. దీంతో మే నెలలో జిల్లాలో తాగునీటి సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏనాడూ బిందెలతో రోడ్డెక్కిన సందర్భాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలను కష్టాలు పాలుచేస్తున్నదని, మళ్లీ పాతరోజులు వచ్చాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలం, మే 3 : భద్రాచలం వద్ద గోదావరి నీటి నిల్వ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2019 తరువాత ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి. భద్రాచలం పట్టణానికి ప్రతిరోజు 6.5 ఎంఎల్డీల నీటిని తాగునీటి నల్లాలకు సరఫరా చేస్తారు. కానీ ప్రస్తుతం ఇన్టెక్వెల్లో సిల్టు 15 అడుగుల మేర పేరుకుపోవడంతో తాగునీటి సరఫరాకు గడ్డు పరిస్థితి ఏర్పడుతోంది. సాధారణంగా వేసవి సమీపించే సమయంలోనే సిల్టు తొలగించే పనులు పూర్తి చేయాలి.
కానీ అధికారులు దృష్టిసారించకపోవడంతో ప్రస్తుతం నీటి నిల్వ రెండు అడుగుల స్థాయికి పడిపోయింది. దీంతో పంపింగ్ సక్రమంగా జరగడం లేదు. గత మూడ్రోజులుగా అధికారులు సిల్టు తొలగించే పనులు చేస్తున్నా అవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. భద్రాచలం పట్టణంలో ప్రస్తుతం రోజూ గంట, రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ప్రజలు నల్లాల వద్ద కాపలాకాయాల్సి వస్తోంది.
ప్రతి సంవత్సరం ఎండాకాలం నీటికి ఇబ్బంది పడుతున్నం. ఈ యేడాది తాగునీరు కూడా దొరకడం లేదు. తోగుల వద్దకు పోయి ఊట నీటిని తోడుకుని తెచ్చుకుని తాగుతున్నం. తోగు నీటిని తెచ్చుకునేందుకు అడవిలో నడిచిపోతున్నం. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఆడోళ్లందరం కలిసి అడవికి పోయి తాగునీరు తెచ్చుకుంటున్నం.
– కురసం సమ్మక్క, వెంకటచెర్వు, చర్ల మండలం
ప్రభుత్వం వేసిన బోర్లు ఎండాకాలం పనిచేస్తలేవు. బకెట్ నీళ్లొస్తే తరువాత చుక్కనీరు కూడా రావడం లేదు గాలొస్తున్నది. అధికారులకు చెప్పినం ఏదో చేసినట్టు చేస్తరు మళ్లీ మామూలే. మా ఊర్ల ఉన్న బోర్లన్నీ ఇట్లనే ఉన్నయ్. అడవిలో తోగు దగ్గరికి పోయి నీళ్లు తెచ్చుకొని తాగుతున్నం. వాటికే అలవాటుపడ్డం. ఎండాకాలం అంతా ఇంతే మా బతుకు. ప్రతి ఏడాది నీటికి ఇబ్బంది పడుతూనే ఉన్నాం.
– కోరం సంతోష్, వెంకటచెర్వు, చర్ల మండలం
నీటి సరఫరా లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా లేకపాయె. తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. తాగునీటి విషయంలో ప్రజాప్రతినిధులు స్పందించాలి. నీటి సరఫరా చేయని పక్షంలో ధర్నాలు, రాస్తాకోలు చేస్తాం.
-జాటోత్ చంద్రమ్మ, నెహ్రూనగర్, ఇల్లెందు మండలం
వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి. ఈ విషయం గురించి అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశాం. పంచాయతీ కార్యదర్శికి తాగునీటి విషయంలో పడే ఇబ్బంది గురించి వివరించాం. కనీసం వాటర్ ట్యాంకు ద్వారా నీరు అందించాలని కోరాం. అయినా మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
-నూనావత్ భద్రమ్మ, నెహ్రూనగర్, ఇల్లెందు మండలం
మండలాల్లో ఎక్కడా తాగునీటి సమస్య లేదు. చివరి గ్రామాలకు మాత్రం ట్యాంకులు ఎత్తున ఉండటంతో నీరు చేరడం లేదు. రిపేర్లు ఉన్న పైప్లైన్లన్నీ మరమ్మతులు చేశాం. ఇల్లెందు మండలం నెహ్రూనగర్‌లో కొత్త పైప్‌లైన్ వేయాల్సి ఉంది. కలెక్టర్ సారు రూ.20 లక్షలు మంజూరు చేశారు. నెలరోజుల్లో అక్కడ పనులు పూర్తిచేస్తాం. చేతిపంపులన్నీ వర్కింగ్లోనే ఉన్నాయి.
– ఈఈ తిరుమలేష్, ఈఈ, మిషన్ భగీరథ, భద్రాద్రి కొత్తగూడెం
మా కాలనీలో సుమారు 45 కుటుంబాలకు నీటి సరఫరా కావడం లేదు. తాగునీరు రావడం లేదనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రతిరోజూ తాగునీటి కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది. ఈ ప్రభుత్వానికి ప్రజలంటే లెక్కలేదా. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు.
చేతిపంపు నీరే మాకు గతి..
భగీరథ ట్యాంకుకు నీరు ఎక్కడం లేదు. ఊర్లో ఉన్న మోటర్ కాలిపోయింది. రిపేరు చేయించమంటే ఎవరూ చేయించడం లేదు. డబ్బులు వేసుకుని మీరే చేయించుకోమంటున్నారు అధికారులు. చేతిపంపుల దగ్గరకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నాము. ఎండలు పెరిగితే చేతిపంపుల్లో కూడా నీరు ఉండదు. ఏటా మాకు నీటి కష్టాలు తప్పడం లేదు.
– తుర్రం రాము, కొత్త జిన్నెలగూడెం, దుమ్ముగూడెం మండలం
భద్రాచలం పట్టణంలో తాగునీటికి ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుల పేరుతో ఉదయం, సాయంత్రం తక్కువ సమయం తాగునీటి సరఫరా ఇవ్వడంతో నల్లాల్లో వచ్చిన నీరు సరిపోవడంలేదని మహిళలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు సిల్టు తొలగింపు పనులు త్వరితగతిన చేపట్టి సకాలంలో మంచినీటి సరఫరా జరిగేలా చూడాలి.
– ఆకోజు సునీల్‌కుమార్, స్థానికుడు, భద్రాచలం