జూలూరుపాడు, మార్చి 16:గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ ఇళ్లకు శుద్ధజలాలు అందించిన మిషన్ భగీరథ ట్యాంకును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ దుబ్బతండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకుకు నీళ్లు ఎక్కించే పైపులు పగిలి నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదని ఆరోపిస్తున్నారు.
వాటికి మరమ్మతులు చేసి ట్యాంకుకు నీళ్లు ఎక్కించి తమకు సరఫరా చేసేందుకు కనీస చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. గడిచిన నెల రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు సమస్యను వివరించినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం తండావాసులంతా కలిసి ఖాళీ బిందెలతో ట్యాంకు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పైపులకు మరమ్మతులు చేయించి తమకు వెంటనే తాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాగేందుకు కనీసం గుక్కెడు నీళ్లు కూడా అందకపోవడంతో ఇళ్లలో పిల్లలమూ, పెద్దలమూ తల్లడిల్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తొడ వరకూ కాలు లేని ఓ దివ్యాంగ యువకుడు కూడా కర్ర సహాయంతో ఒంటికాలితో ట్యాంకుపైకి చేరుకొని నినాదాలు చేయడం గ్రామంలోని తాగునీటి తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా, స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్‌నాయక్.. ఆందోళనకారులతో ఫోన్లో మాట్లాడారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపడతామని, వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో తండావాసులు ఆందోళన విరమించారు.