కూసుమంచి, జూలై 10: రైతులు వ్యవసాయంతోపాటు చేపల పెంపకంపై దృష్టి సారిస్తే లాభాలు గడించవచ్చని హైదరాబాద్ మత్స్య పరిశోధనా కేంద్ర సీనియర్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ దీప సుమ అన్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, రాష్ట్ర మత్స్య సంస్థల ఆధ్వర్యంలో మత్స్య రైతులకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట జిల్లాల రైతులకు చేపల పెంపకంపై శుక్రవారం శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని చెరువులతోపాటు అనువైన ప్రదేశాలు చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. మార్కెట్లో చేపలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో పెంపకం వైపు దృష్టి పెట్టాలన్నారు. నాబార్డు మేనేజర్ సుజీత్కుమార్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంతోపాటు చేపల పెంపకానికి సంబంధించి రుణాలు ఇస్తామని, సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి మాట్లాడుతూ రైతులు ఆదాయం పెంచుకోవడానికి మత్స్య రంగంలో మెళకువలు నేర్చుకొని వాటిని ఆచరణలో పెట్టాలన్నారు. అనంతరం మత్స్య దినోత్సవం సందర్భంగా రైతులను, అధికారులను సన్మానించారు. అనంతరం క్షేత్రస్థాయి అంశాల గురించి శాస్త్రవేత్తలు డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ రవీందర్ రైతులకు అవగాహన కల్పించారు.