టేకులపల్లి, మార్చి 8 : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సులానగర్ గ్రామ పంచాయతీని ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఎంపిక చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) చంద్రమౌళి తెలిపారు. సులానగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు-2025ను సీడీపీవో కెఎం.తార ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీపీవో చంద్రమౌళి, సీడీపీవో తార మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, స్వయం సేవా సంఘాల ద్వారా రుణాలు పొంది స్వయంశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలను నిర్మూలించాలని, ప్రతి ఆడపిల్ల ఉన్నత విద్యను అభ్యసిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటే.. ఆ ఇంటి వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుందని, అందుకోసం మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం కౌసల్యసింగ్, మంగతాయారు, రాజేశ్వరి, పద్మ, ఆశా వర్కర్లు చంద్రకళ, చైతన్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.