ఖమ్మం రూరల్, ఆగస్టు 30 : ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థలకు సంబంధించి ఓటరు జాబితాలో ఉన్నటువంటి డబుల్ ఓటర్లను తొలగించాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. శనివారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ఎంపీడీఓ శ్రీదేవి తన కార్యాలయంలో కార్యాలయ పర్యవేక్షకురాలు పద్మావతితో కలిసి ఆయా రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలను తెలియజేయాలని ఎంపీడీఓ కోరారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తూ.. పలు గ్రామాల్లో ఒకే పేరుతో డబుల్ ఓట్లు ఉన్నందున జాబితాను సవరించాలన్నారు. అదేవిధంగా చనిపోయిన ఓటర్లను సైతం తొలగించాలన్నారు.
మండలంలోని పిట్టలవారిగూడెంలో పోలింగ్ బూత్ లేకపోవడం వల్ల ఆ గ్రామ ఓటర్లు సుమారు 3 కిలోమీటర్ల పైగా వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందందున అక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. సెప్టెంబర్ 2వ తేదీన ఓటరు జాబితా ప్రదర్శించడం జరుగుతుందని, ఆ జాబితాలో నిబంధనలకు అనుగుణంగానే తుది జాబితా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కళ్లెం వెంకట్రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, సిపిఎం నేత నండ్ర ప్రసాద్, టిడిపి మండలాధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, సిద్దినేని కర్ణకుమార్ పాల్గొన్నారు.