ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 8: ‘విద్యార్థుల్లోని మేధస్సు వికసించాలి. వారు జ్ఞాన సంపన్నులుగా ఎదగాలి. సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనల వైపుగా ముందుకు సాగాలి.’ అనే లక్ష్యాల సాధనలో భాగంగా ఖమ్మంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఈ నెల 9, 10 తేదీల్లో జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్) నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రదర్శన ప్రాంగణానికి డాక్టర్ విక్రమ్ సారాబాయిగా నామకరణం చేశారు. ఈ రెండు రోజులపాటు సాయంత్రం వేళల్లో హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ తదితర ప్రాఖ్యాత సంస్థల్లోని శాస్త్రవేత్తలు సందేశాలిస్తారు. ఈ ప్రదర్శన నిర్వాహక కమిటీ సమావేశం ఆదివారం ఖమ్మం నగరంలో జరిగింది. డీఈవో సోమశేఖరశర్మ, ఎంఈవోలు శైలజాలక్ష్మి, శ్రీనివాస్, రాములు, వీరస్వామి, సైన్స్ ఆఫీసర్ జగదీష్, సీఎంవో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రదర్శనలో 10 నుంచి 17 ఏళ్లలోపు విద్యార్థులు పాల్గొంటారు. 10 నుంచి 14 ఏళ్లలోపు వారిని జూనియర్లుగా, 15 నుంచి 17 ఏళ్లలోపు వారిని సీనియర్లుగా పరిగణిస్తారు. ఫుడ్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, న్యాచురల్ ఫామింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మ్యాథమేటిక్ మోడలింగ్, వేస్ట్ మేనేజ్మెంట్, రీసోర్స్ మేనేజ్మెంట్ – అంశాల ఇతివృత్తంగా నమూనాలను విద్యార్థులు ప్రదర్శిస్తారు. ఇన్‌స్పైర్‌కు 119 ఎగ్జిబిట్లు ఎంపికయ్యాయి. సైన్స్ ఫెయిర్‌కు 486 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఉత్తమ ప్రదర్శనల ఎంపికకు 32 మందితో కూడిన 16 కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రదర్శనలను మొదటి రోజున (9న) రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం త్రీ టౌన్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు తిలకించవచ్చు. రెండో రోజున (10న) ఖమ్మం అర్బన్, వన్‌టౌన్, టూటౌన్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులు తిలకించవచ్చు.