2025-26 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీ జనరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అదే తడవుగా ఆయా రాష్ర్టాలతోపాటు తెలంగాణ ప్రభుత్వం కూడా కిందిస్థాయి ఇబ్బందులేమీ పట్టించుకోకుండా కేంద్రానికి వంత పాడుతూ విద్యాశాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు అపార్ కష్టాలు మొదలయ్యాయి. ఆయా జిల్లా విద్యాశాఖాధికారులు ప్రతి విద్యార్థికీ అపార్ చేయించాలని ఆదేశాలివ్వడంతో 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థి వరకు అపార్ జనరేషన్ చేయించుకుంటున్నారు. అపార్ ఐడీ కార్డు అనేది డిజీ లాకర్ అనే యాప్, ఏబీసీ(అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్) అనే సాంకేతికతతో కలిసి ఉంటుంది. దీని ద్వారా విద్యార్థుల విద్యకు సంబంధించిన డేటా గోప్యంగా ఉంటుందని విద్యాశాఖాధికారులు అంటున్నారు. అయితే, ప్రతి విద్యార్థి అపార్ నంబర్ పొందడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ తన వెబ్‌సైట్‌లోని ఒక పత్రంలో ఈ మధ్యనే పేర్కొంది. అయినప్పటికీ ఆయా రాష్ర్టాలు విద్యార్థులకు అపార్ చేయించాలంటూ సర్క్యులర్లు జారీ చేస్తున్నాయి. అయితే, ఇప్పటికే ప్రతి వ్యక్తికి, ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డులు ఉండగా.. మళ్లీ విద్యార్థులకు అపార్ కార్డు ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
పాఠశాల రికార్డుల్లోని విద్యార్థుల వివరాల్లో మార్పులు చేసే అధికారాన్ని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు, మండల విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం ఈ మధ్యనే ఇచ్చింది. కానీ, వాస్తవ పరిస్థితులు వారికి అనుకూలించడం లేదు. విద్యార్థుల సరైన ధ్రువపత్రాలు లేనందున వివరాల్లో మార్పులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒకవేళ సరైన ధ్రువపత్రాలు లేకుండా విద్యార్థుల వివరాల్లో మార్పులు చేస్తే భవిష్యత్తు సర్వీస్‌లో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్ఎంలు, ఎంఈవోలు భావిస్తున్నారు. దీంతో విద్యార్థుల రికార్డుల సవరణకు మొగ్గు చూపడం లేదు. దీంతో సదరు విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి బర్త్ సర్టిఫికెట్లు, స్థానికత ధ్రువపత్రాల కోసం మీసేవ కేంద్రాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు.
విద్యార్థుల అపార్ నంబర్ కోసం ఉపాధ్యాయులకు ఇచ్చే అర్జీ దరఖాస్తులో తల్లిదండ్రుల సమ్మతి కోరారు. దీంతో కొందరు తల్లిదండ్రులు సమ్మతిని విరుద్ధంగా వ్యక్తపరుస్తున్నారు. తమ పిల్లల డేటా గోప్యత పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. విద్యార్థుల అపార్ కార్డుల జనరేషన్లో ఖమ్మం కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించడంతో విద్యాశాఖాధికారులు, హెచ్ఎంలు అపార్ జనరేషన్‌ను ప్రథమ ప్రాధాన్య అంశంగా పరిగణించి దసరా సెలవుల్లోనూ పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల స్టడీ సర్టిఫికెట్లు రాసిచ్చారు. దీంతోపాటు మీ సేవ కేంద్రంలో స్థానికత, పుట్టిన తేదీ ధ్రువపత్రాల మంజూరుకు తోడ్పడుతున్నారు. దసరా సెలవుల కంటే ముందుగా విద్యాశాఖాధికారులతో కలెక్టర్ ఏర్పాటు చేసిన సమీక్షలో అపార్ జనరేషన్ వెనుకబాటుకు కారణాలను ప్రశ్నించారు. అయితే, పుట్టిన తేదీల్లో తప్పులున్నాయని కలెక్టర్‌కు పలువురు హెచ్ఎంలు బదులిచ్చారు. దీంతో విద్యార్థుల పుట్టిన తేదీల మంజూరు కోసం ఆర్డీవోలకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఆయా ఎంఈవోల ద్వారా పుట్టిన తేదీ సరిగా లేని విద్యార్థుల వివరాలు సేకరించారు. కాకపోతే విద్యార్థుల స్థానికత ధ్రువపత్రం కావాల్సి ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, హెచ్ఎంలు మీ సేవ కేంద్రాలకు ప్రదక్షిణలు చేస్తున్నారు.
అపార్ కార్డుతో దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే దగ్గర ఉంటాయి. విద్యార్థి ఎల్కేజీలో చేరినప్పటి నుంచి అతడి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. విద్యార్థి విద్యాభ్యాసం పూర్తి వివరాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. ఈ అపార్ కార్డును ఆధార్ సంఖ్యతోపాటు ఏబీసీకి అనుసంధానం చేస్తారు. ఈ అపార్ నంబరే విద్యార్థి విద్యాభ్యాసానికి సంబంధించి జీవితకాల ఐడీగా పరిగణనలో ఉంటుంది. అపార్ ఐడీలో అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, మార్కుల సర్టిఫికెట్లు, విద్యార్థి కుటుంబ వివరాలు, విద్యార్థి సాధించిన అకడమిక్ విజయాలు వంటివన్నీ పొందుపర్చనున్నారు. అవసరమైన సమయాల్లో అపార్ నంబర్ ద్వారా విద్యార్థి విద్యాభ్యాస వివరాలు ట్రాక్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో అపార్ జనరేషన్ కోసం ఎంఈవోలు, హెచ్ఎంలు, టీచర్లు, అపార్ నంబర్ రాని విద్యార్థులు విజయదశమి సెలవుల్లోనూ పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు తీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులతో దసరా సెలవుల్లోనూ పని చేయిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పల్లెల్లో పండుగ పూట విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. గత నెల 21వ తేదీ నుంచి విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించగా.. శనివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.
అపార్ కష్టాల్లో మచ్చుకు కొన్ని..
వన్ నేషన్ – వన్ స్టూడెంట్’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన విధానం, ఆదేశాలతో అపార్ నంబర్ నమోదులో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు తల్లిదండ్రులు, ఇంకోవైపు ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. వాటిల్లో మచ్చుకు కొన్నింటిని
1. విద్యార్థి ఆధార్ కార్డులోని పుట్టిన తేదీ, పాఠశాల రికార్డుల్లో నమోదైన పుట్టిన తేదీ వేర్వేరుగా ఉంటున్నాయి.
2. విద్యార్థి ఆధార్ కార్డులో పూర్తి పేరు (ఇంటి పేరుతో సహా) ఒక రకంగా, పాఠశాల రికారుల్లో మరో రకంగా ఉంటున్నాయి.
3. విద్యార్థి అపార్ కార్డు జనరేషన్లో అతడి ఆధార్ కార్డుతోపాటు తల్లిద్రండుల ఆధార్ కార్డులను ప్రమాణికంగా తీసుకోవడంతో ముగ్గురి కార్డుల్లో వారి ఇంటి పేర్లు, వారి పేర్లు వేర్వేరుగా ఉంటున్నాయి. దీంతో దేనిని ప్రామాణికంగా తీసుకొని పాఠశాల రికార్డుల్లో నమోదు చేయాలో అనే అంశం హెచ్ఎంలకు కష్టతరమవుతోంది.
4. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒక్కరు లేకపోయినా లేదా చనిపోయినా విద్యార్థి అపార్ నంబర్ జనరేట్ చేయడం కష్టమవుతోంది.