ఖమ్మం, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో రానున్న సాధారణ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని, ఎన్నికల కమిషన్ ఆదేశాలు, నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న విధానాలపై వివరాలు వెల్లడించారు. జిల్లాలో శాసన సభ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఈవీఎంలను ఈసీఐఎల్ ద్వారా ఎన్నికల కమిషన్ పంపించిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మొదటి దశ పరిశీలన(ఎఫ్ఎల్సీ) అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేశామన్నారు. సక్రమంగా లేని 100 ఈవీఎంలు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. కంట్రోల్ యూనిట్లన్నీ సక్రమంగా పని చేశాయని తెలిపారు. 2,359 వీవీప్యాట్స్ యూనిట్లకు 2,343 యూనిట్లు సక్రమంగా ఉన్నాయని, సక్రమంగా లేని 16 వీవీప్యాట్స్ యూనిట్లను తిరిగి పంపించామన్నారు.ఐదు నియోజకవర్గాలలో 1439 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వాటిలో ఖమ్మం-341, పాలేరు-289, మధిర-268, వైరా-252, సత్తుపల్లి-289 కేంద్రాలు ఉన్నాయన్నారు. నియోజకవర్గాలలో ఈనెల 18వ తేదీ నాటికి జరిగిన పరిశీలన, సర్వే అనంతరం ఐదు నియోజకవర్గాలలో పురుషులు – 5,69,211, మహిళలు – 5,97,788, ట్రాన్స్ జెండర్లు-78, మొత్తంగా 11,67,077 మంది ఓటర్లు ఉన్నారని వారిలో ఎన్ఆర్ఐలు-143, సర్వీస్ ఓటర్లు-680 వరకు ఉన్నాయని తెలిపారు.
18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు
జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండనున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. ఆగస్టు 21న ఓటర్ల జాబితా ప్రదర్శిస్తామన్నారు. 21 నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు ప్రదర్శించిన ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు, ఏవైనా నమోదులు ఉంటే స్వీకరిస్తామన్నారు. ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 3 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపడతామని తెలిపారు. ప్రజలు, పార్టీల ప్రతినిధుల ఉంచి వచ్చిన అభ్యంతరాలను ఆగస్టు 28వ తేదీన పరిష్కరిస్తామన్నారు. అనంతరం కమిషన్ ప్రత్యేక అనుమతితో అనారోగ్య కారణాలతో ఇంకా ఎవరైనా అభ్యంతరాలు ఇస్తే అక్టోబర్ 1వ తేదీ వరకు స్వీకరించి పరిష్కరించడంతో పాటు తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసి అక్టోబర్ 4వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని తెలిపారు.
రేపటి నుంచి మొబైల్ వ్యాన్లతో ఈవీఎంపై అవగాహన ..
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఓటర్లకు ఈవీఎంల పనితీరు, వినియోగంపై అనుమానాలను నివృత్తి చేసేందుకు గురువారం నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల సమన్వయంతో గ్రామాలలో ఓటర్ల చేత మాక్ ఓటింగ్ నిర్వహించి వాటిలో వారు వేసిన ఓటు ఏ గుర్తుకు పడిందో పరిశీలన చేయిస్తామన్నారు. జిల్లా ఎన్నికల కార్యాలయం ఐడీవోసీ, ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం, పాలేరుకు ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయం, మధిర, వైరా, సత్తుపల్లికి ఆయా మండల కేంద్రాల తహసీల్దార్ల కార్యాలయాలలో ఒక్కో ఈవీఎం యూనిట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శసురభి, ట్రైనీ కలెక్టర్ రాధికాగుప్తా, రాజకీయ పార్టీల ప్రతినిధులు నున్నా నాగేశ్వరరావు, తిరుమలరావు, విద్యాసాగర్, జావేద్ పాల్గొన్నారు.