భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13 (నమస్తేతెలంగాణ) : బీసీ కులాలు, నిరుపేదల అభివృధ్ది కోసమే సీఎం కేసీఆర్ బీసీ బంధు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో బీసీ కులవృత్తి లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన బీసీలందరికీ రూ.లక్ష సాయం అందుతుందని ఆయన అన్నారు. మొదటి విడుతగా నియోజకవర్గానికి 300 అందిస్తున్నామని, విడతల వారీగా అందరికీ చెక్కులు అందిస్తామన్నారు. ప్రభుత్వం అందించే పథకాలన్నీ ప్రజలకు చేరడంతోనే ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
అనంతరం కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బంధు పథకం కులవృత్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిరంతరంగా బీసీలకు సాయం అందుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లబ్ధిదారులకు బీసీబంధు చెక్కులను ఎమ్మెల్యే, కలెక్టర్, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, ఎంపీపీలు సోనా, శాంతి, విజయలక్ష్మి, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు ఇందిర, సంజీవరావు, సొసైటీ వైస్ చైర్మన్ జగన్, ఆత్మకమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కౌన్సిలర్ ధర్మరాజు పాల్గొన్నారు.