ఖమ్మం, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్టీ పదవులను ఆశించిన ఉమ్మడి ఖమ్మంజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలకు మరోసారి భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో జెండాను మోసి ఉమ్మడి జిల్లాలో పార్టీ విజయానికి తీవ్రంగా శ్రమించిన సీనియర్ నేతలకు నిరాశే మిగిలింది. ఏఐసీసీ గురువారం ప్రకటించిన రాష్ట్రస్థాయి కమిటీల జాబితా.. ఉమ్మడి జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నేతలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ పదవులపై ఆశ పెట్టుకున్న సీనియర్ కాంగ్రెస్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు, వారి అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కమిటీల ఏర్పాటులో ఉమ్మడి జిల్లాకు సరైన ప్రాధాన్యం లభించలేదన్న అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. పీసీసీ కార్యవర్గాన్ని ఇంకా ప్రకటించనప్పటికీ పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు సహా కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ఐదు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో రాజకీయ సలహా కమిటీలో మాత్రం ఖమ్మం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్‌కు స్థానం లభించింది.
రెండునెలలుగా ఆయా కమిటీల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేతలు ఈ సారైనా తమకు పార్టీపరంగా గుర్తింపు లభిస్తుందని, తాము అందించిన సేవలకు ఫలితం దక్కుతుందని, కమిటీలో అవకాశం వస్తుందని ఆశించారు. అయితే, సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ కాంగ్రెస్ నేతల పేర్లు జాబితాలో లేకపోవడంతో హతాశయులయ్యారు. రాజకీయ సలహా కమిటీలో స్థానం లభించిన నలుగురు నేతలు కీలక పదవుల్లో ఉన్నవారే కావడంతో సీనియర్, ద్వితీయ శ్రేణి నేతలకు అవకాశం కల్పిస్తే పార్టీ కోసం పని చేసినందుకు ఫలితం దక్కిందన్న సంతృప్తి కార్యకర్తల్లో ఉండేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు సరైన గుర్తింపు లభించడం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కమిటీల కూర్పు ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లుగా ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసున్న వారికి, కాంగ్రెస్ జెండా మోసిన సీనియర్లకు పార్టీలోనూ, పదవుల్లోనూ ఏ రకమైన ప్రాధాన్యమూ లభించడం లేదని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పార్టీ నేతలు తమతోపాటు పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యమిస్తున్నారే తప్ప.. పార్టీని కంటికిరెప్పలా కాపాడుకున్న వారికి అవకాశాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏఐసీసీ ప్రకటించిన రాజకీయ సలహా కమిటీలోనూ, ఇతర కమిటీల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలకు అవకాశం లభిస్తుందని జిల్లా పార్టీ వర్గాలు భావించాయి. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి, కొత్తగూడేనికి చెందిన ధర్మారావు, నాగా సీతారాములు, ఖమ్మానికి చెందిన జావేద్, కొత్తా సీతారాములు, బుక్కా కృష్ణవేణి వంటి నాయకులకు ఆయా కమిటీల్లో స్థానం లభిస్తుందని జిల్లా కాంగ్రెస్ వర్గాలు, ఆయా నేతల అనుచరగణాలు భావించాయి.
జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుండగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు మాత్రమే రాజకీయ సలహా కమిటీలో అవకాశం కల్పించారు. సీనియర్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న పోరిక బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డిలకు మాత్రమే రాజకీయ సలహా కమిటీలో అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లాలోని పది శాసనసభా స్థానాల్లో రిజర్వుడు స్థానాల నుంచి గెలిచిన ఐదుగురు గిరిజన శాసనసభ్యులకు ఈ కమిటీల్లో స్థానం లభించలేదు. కాంగ్రెస్ విజయంలో కీలక భూమిక పోషించిన ఉమ్మడి ఖమ్మంజిల్లాకు తగిన ప్రాధాన్యం దక్కలేదనడానికి ఇదే నిదర్శనమంటూ కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.