కారేపల్లి, జనవరి 29 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని బాజుమల్లాయిగూడెం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల మధ్య అంతర్గత లొల్లి చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. పాఠశాలలో ఏడుగురు పురుష, ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు ఉపాధ్యాయులు విద్యార్థుల ముందే గొడవలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులను టార్గెట్ చేసి మిగతా ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. పదో తరగతి విద్యార్థులకు ఆ గ్రామానికి చెందిన ఓ ఎన్నారై స్నాక్స్ వితరణ చేశాడు. ఈ నెల 24న బీరువాలో దాచిపెట్టిన స్నాక్స్ నిల్వ తగ్గడం ఉపాధ్యాయుల మధ్య తగాదాకు దారి తీసింది.
దీంతో ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటూ విద్యార్థుల ముందే ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ గ్రామానికి చెందిన కొంతమంది పెద్దమనుషులు ఉపాధ్యాయుల పంచాయితీపై చర్చించినట్లు తెలిసింది. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలువడంతో ఉపాధ్యాయుల పంచాయతీల వల్ల తమ పిల్లల చదువు ఫలితాలపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఉపాధ్యాయుల మధ్య అనేకసార్లు గొడవలు జరిగిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఉన్నతాధికారులు ఈ పాఠశాలపై దృష్టి సారించి తమ పిల్లలకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.