భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పరికరాల కోసం దివ్యాంగులకు పడిగాపులతోపాటు తిప్పలు తప్పడం లేదు. వారంరోజుల క్రితం కలెక్టరేట్లో జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనే ఇందుకు నిదర్శనం. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అధికారులు చూస్తూ ఉండిపోయారు తప్ప కనీసం అల్పాహారం కూడా ఏర్పాటు చేయలేదని దివ్యాంగుల నుంచి విమర్శలు వినిపించాయి. సామాన్యుల లాగానే దివ్యాంగులను కూడా ప్రతిదానికి అధికారులు జిల్లా కేంద్రానికి రప్పిస్తుండడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు.
దివ్యాంగుల పరికరాల కోసం ఇటీవల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 126 యూనిట్లు ఉండగా.. మొత్తం 382 మంది తమకు దివ్యాంగ పరికరాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తులను గత మంగళవారం కలెక్టరేట్లో డీఎంహెచ్వోతోపాటు జిల్లా సంక్షేమ అధికారి, డీఆర్డీవో పరిశీలించారు. పరికరాలు అందరికీ అవసరమే కానీ అక్కడ సగం యూనిట్లు కూడా లేవు. మరి సర్దుబాటు ఎట్లా చేస్తారనేది అసలైన ప్రశ్న. అర్హులను అధికారులు ఎలా గుర్తిస్తారు.. ఇందులో పైరవీలు నడుస్తాయా అని దివ్యాంగుల్లో ఆందోళన కలుగుతున్నది. అధికారులు మాత్రం దీనికి సమాధానం చెప్పడం లేదు.
దివ్యాంగులకు ఎలాంటి కార్యక్రమాలు జరిగినా తప్పనిసరిగా వాహనాలు ఏర్పాటు చేయాలి. కానీ.. అలా చేయకపోవడంతో దూరప్రాంతాల నుంచి రావడం చాలా కష్టతరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల్లో రాయితీలు ఉన్నా అవి ఎక్కాలన్నా.. దిగాలన్నా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని వాపోతున్నారు. జిల్లాకేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఆయా శాఖలు తప్పనిసరిగా వాహనాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్యాలయం ఉన్నా అక్కడ కనీసం కూర్చునే పరిస్థితి లేదని చెబుతున్నారు.