మధిర (చింతకాని ), ఏప్రిల్ 07 : దివ్యాంగ చిన్నారులకు ప్రతి బుధవారం నిర్వహించే ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా చింతకాని మండల విద్యాశాఖ అధికారి సలాది రామారావు అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు ఫిజియోథెరపీ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చింతకాని మండల పరిధిలోని లచ్చగూడెం హై స్కూల్ ప్రాంగణంలో దివ్యాంగ బాలబాలికల భవితా కేంద్రం సేవలందిస్తుందన్నారు.
19 ఏళ్ల లోపు వయసు గల శరీరక వైకల్యం కలిగిన వారికి ఈ సేవలు అందించడం జరుగుతుందన్నారు. పుట్టుకతో వచ్చే పాక్షిక పక్షవాతం, శరీరంలోని కండరాల మధ్య సమన్వయ లోపంతో బాధపడుతూ కూర్చోడంలోనూ, నిలబడడం, అడుగులు వేయడం, నడవడంలోనూ ఇబ్బంది పడే చిన్నారులకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఆర్పీలు కే.ఎస్. కృష్ణారావు 6302504078, 9492244874, భూక్య దస్లి 9701611706, ఫిజియోథెరపీ వైద్య నిపుణురాలు డాక్టర్ జి.వసంత 9618608929 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.