రఘునాథపాలెం/జూలూరుపాడు/చండ్రుగొండ, డిసెంబర్ 21 : బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించి కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో తరగతులు సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థినులు రఘునాథపాలెం, జూలూరుపాడు, చండ్రుగొండ కేజీబీవీల ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి ప్రవీణ్, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నందున చదువులు ముందుకు సాగకపోవడంతో పక్షం రోజులకు పైగా విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించి, విద్యార్థినుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో సంఘాల నాయకులు మనోజ్, త్రినాథ్, ఉదయ్, వంశీ, చాంద్‌పాషా, అనిల్, బాలాజీ, రాంచరణ్, విద్యార్థినులు పాల్గొన్నారు.