ప్రభుత్వ పథకాలను పట్టణాల్లో క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లు (ఆర్పీ) ఆకలితో అలమటించేలా చేస్తోంది ఏడాది క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలన్నీ ఆకలితో అల్లాడిపోతున్నాయి. కిరాణా సరుకులు అరువు ఇచ్చిన దుకాణదారులు కూడా అప్పు తీర్చాలంటూ ఎనిమిది నెలలుగా అడుగుతుండడంతో వారికి మొఖం చూపించడానికి కూడా ముందూవెనుకా ఆలోచిస్తున్నారు ఆర్పీలు. ఇక వారి ఇతర సమస్యలనూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో విసిగిపోయిన ఆర్పీలు ఆందోళనబాట పట్టారు.
-కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 12
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు, ప్రభుత్వం చేపట్టే సర్వేలను పూర్తి చేసేందుకు, ఇతర సర్కారు సంబంధ పనులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు మొదటగా గుర్తుకొచ్చేది స్వయం సహాయక సంఘాల మహిళలే. ఆ మహిళా సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహిస్తున్నారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రిసోర్స్ పర్సన్లు. మహిళల ఆర్థికాభివృద్ధికి రుణాలు అందించేందుకు, వారి కాళ్లపై వారు నిలదొక్కుకునేలా చేసేందుకు ప్రభుత్వం 2008లో ఈ వ్యవస్థను రూపొందించింది. గత పదేళ్లుగా స్వయం సహాయక సంఘాల సభ్యులను సమన్వయం చేస్తూ, రూ.1,200 గౌరవ వేతనంతో స్వచ్ఛందంగా కార్యకలాపాలను నిర్వహిస్తూ రిసోర్స్ పర్సన్లు(ఆర్పీ)లు నివేదికలను అందజేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో వీరు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భవించాక వీరి శ్రమను గుర్తించిన గత కేసీఆర్ ప్రభుత్వం వీరి గౌరవ వేతనాన్ని రూ.4,000కు పెంచింది. వారి కష్టాలను కొంతవరకు దూరం చేసింది. ఆ తర్వాత 2023 ఎన్నికలకు ముందు మరోసారి ఆర్పీల వేతనాలను రూ.6,000కు పెంచింది. ఆ తర్వాత కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలపాటు ఆ రూ.6,000 చొప్పున వేతనాలు చెల్లించింది. కానీ.. గడిచిన ఎనిమిది నెలలుగా అసలు వేతనాలే ఇవ్వడం లేదు. ఒకటీ రెండు నెలలుగా ఆశతో వేచి చూసిన ఆర్పీలకు నిరాశే మిగిలింది. ఏకంగా ఎనిమిది నెలలపాటు వేతనాలు విడుదల చేయకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికంగా సతమతమవుతున్నారు. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధానిలోని మెప్మా డీఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు.
సమస్యలు పరిష్కరించండి మహాప్రభో..
జీవో 164 ప్రకారం వీఎల్ఆర్ స్త్రీనిధి, లోకల్‌బాడీ నిధుల నుంచి రిసోర్స్ పర్సన్లకు గౌరవ వేతనం ఇవ్వాలనే నిబంధన తొలగించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లోని వీవోఏల మాదిరిగా ప్రభుత్వపరంగా ప్రత్యేక నిధులు కేటాయించి గౌరవ వేతనం ఇవ్వాలని ఆర్పీలు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ అమలు చేయాలని, రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్పీలకు ఒకే డ్రెస్ కోడ్ అమలు చేయాలని, జాబ్ చార్ట్ విడుదల చేయాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని, మూడు నెలలకోసారి ఈసీ తీర్మానాలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇలాంటి ప్రధానమైన డిమాండ్లతో ఆందోళనకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్రం ఏర్పడ్డాక సమగ్ర కుటుంబ సర్వే, జనగణన సర్వే, స్వచ్ఛ భారత్, హరితహారం, బడిబాట సర్వే, బతుకమ్మ చీరెల పంపిణీ, పల్స్ పోలియో, సదరం క్యాంపులు, కరోనా బాధితుల సర్వే, వారికి మందుల పంపిణీ వంటి అనేక ప్రభుత్వ పనుల్లో వీరు ముందుంటున్నారు. కీలకపాత్ర పోషిస్తున్నారు. కానీ.. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఎనిమిది నెలలుగా వీరికి వేతనాలే ఇవ్వడం లేదు. దీంతో వీరి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మంది ఆర్పీలు విధులు నిర్వహిస్తుండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 385 మంది పనిచేస్తున్నారు. ఇందులో భద్రాద్రి జిల్లాలోనే కొత్తగూడెం మున్సిపాలిటీలో 43, పాల్వంచలో 43, ఇల్లెందు 22, మణుగూరులో 20 మంది ఉన్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో నలుగురు టౌన్ లెవల్ ఫెడరేషన్ సభ్యులు కూడా ఉన్నారు.
వేతనాలు అందక ఎనిమిది నెలలు..
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం మా సమస్యలు కొన్ని పరిష్కరించింది. గౌరవ వేతనమూ పెంచింది. కానీ.. కొత్త ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా మా సమస్యలను పట్టించుకోవడం లేదు. అసలు ఎనిమిది నెలలుగా వేతనాలే ఇవ్వలేదు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అందుకు సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాం.
-తిరుపతి, కొత్తగూడెం మెప్మా ఆర్పీ, ఆర్పీ అసోసియేషన్