ఖమ్మం, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం బాధితులుగా ఉన్న ప్రజలతో మాత్రమే ఉంటుందని అన్నారు. నేరాలకు, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉండదని స్పష్టం చేశారు. నేరాల కట్టడి కోసం పోలీసులు తమ ఆయుధాలకు పని చెబుతారని తెలిపారు. ఖమ్మం నగరంలో మంగళవారం పర్యటించిన డీజీపీ.. ఇక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ సరిహద్దులో గంజాయికి వ్యతిరేకంగా మావోయిస్టులు పనిచేశారని, గంజాయి పండిస్తున్న వారిని గుర్తించి వారిని దండించే వారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ప్రధానంగా గంజాయి వంటి మాదకద్రవ్యాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని అన్నారు. పలు రాష్ర్టాలకు ఎంట్రీ పాయింట్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నందున ఇక్కడి నుంచే నియంత్రణ ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. గంజాయి సరఫరా చేసే నేరస్తుల కంటే మావోయిస్టులే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలను, యువతను టార్గెట్‌గా చేసుకొని స్కూళ్లు, కాలేజీల వద్ద ఉండే దుకాణాలు అడ్డాగా చేసుకొని విక్రయించడం అత్యంత దారుణమని అన్నారు.
ఏఐని వినియోగిస్తాం..
నేరాల నియంత్రణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించుకుంటామని, నార్కోటిక్స్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నామని డీజీపీ తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణపై ఉక్కుపాదం మోపుతామని, నేరస్తులను వదిలిపెట్టే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ బాగా చేస్తోందని కితాబిచ్చారు. ఖమ్మం జిల్లాలో దొంగతనాల ద్వారా రూ.11 కోట్లు దోపిడీ జరిగిందని, సైబర్ క్రైమ్‌లో రూ.42 కోట్లు పొగొట్టుకున్నారని, వీరిలో ఎక్కువగా ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారని వివరించారు. నమోదు చేసి విచారణ చేసిన కేసులో శిక్షలు తక్కువ పడుతున్నాయని, దీనిపై విచారణాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దృష్టి సారిస్తున్నామని, ట్రాఫిక్ మెనేజ్‌మెంట్‌పై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాపర్టీ రివకరీ కొన్నిసార్లు పూర్తిస్థాయిలో జరగదని తెలిపారు. చాలా కేసుల్లో నేరస్తులను అరెస్టు చేశామని, ప్రాపర్టీ రికవరీ కోసం పనిచేస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన అతి పెద్ద సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న సామినేని రామారావు హత్య కేసు విచారణను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఖమ్మం సీపీని ఆదేశించినట్లు చెప్పారు. ట్రాఫిక్‌పై హైదరాబాద్ నుంచి ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేసి ప్రమాదాల నియంత్రణపై దృష్టి సారించామన్నారు.
మావోయిస్టులపై నిఘా కొనసాగుతోంది..
రాష్ట్రంలో మావోయిస్టులపై నిఘా ఇంకా కొనసాగుతుందని డీజీపీ తెలిపారు. ప్రస్తుతం లొంగిపోయిన వారి కదలికపై దృష్టి సారించామన్నారు. రెండు నెలల కాలంలో ఎస్ఐ, ఆపై అధికారులు 6,500 మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలీసుల నుంచి ప్రజలు ఏమి ఆశిస్తారో వాటి గురించి చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల పని అయిపోయిందనే కారణంతో గ్రేహౌండ్స్‌ను వెనక్కి తీసుకురాలేమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఖమ్మం సీపీ సునీల్‌దత్, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.