మధిర, ఏప్రిల్ 10;మధిర మురిసి మెరిసిపోతోంది.. సీఎం కేసీఆర్ పాలనలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరువయ్యాయి. అభివృద్ధికి నిధులు వరదలా వస్తున్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛజలాలు అందుతున్నాయి. ఫ్లోరైడ్హ్రిత మధిరగా మార్చేందుకు సర్కార్ 5 మండలాల్లో 76,400 మంచినీటి పంపులను ఏర్పాటు చేసింది. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇలా ఎన్నో పథకాలు అర్హులకు అందాయి. బోనకల్లు, మధిర, ఎర్రు పాలెం, చింతకాని, ముదిగొండ మండలాల్లో 122 చెరువులకు రూ.18 కోట్లతో మరమ్మతులు చేయించారు. దీంతో చెరువులు నీటితో కళకళలాడు తున్నాయి. చింతకాని మండలంలో 3,462 కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయి. నియోజకవర్గానికి మరో వంద యూనిట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఇలా మొత్తం 3,562 కుటుంబాలకు యూనిట్లకు రూ.356.20 కోట్లు మంజూరయ్యాయి. ‘పల్లె ప్రగతి’తో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల రూపురేఖలు మారింది. ఏ గ్రామానికెళ్లినా పచ్చందాలు స్వాగతం పలుకుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. నర్సరీలు, వైకుంఠ ధామాలు, రైతు వేదిక, కొత్త పంచాయతీ భవనాలు గ్రామీణ వైభవాన్ని చాటుతున్నాయి.
తెలంగాణ సిద్ధించిన తర్వాత మధిర నియోజకవర్గంలో పెనుమార్పులు సంభవించాయి. మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండలాలతోపాటు మధిర మున్సిపాలిటీలో అభివృద్ధి- సంక్షేమం జోడెడ్లలాగా పరుగులు తీస్తున్నాయి. గ్రామాలన్నీ పచ్చని పల్లెలుగా మారాయి. మధిర పట్టణం అందంగా రూపుదిద్దుకున్నది. ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడంతో ప్రజలందరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇబ్బందులు తొలగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వంపై చల్లని దీవెనలు కురిపిస్తున్నారు.
వంద కోట్లతో ‘మధిర’ అభివృద్ధి
నాడు గ్రామపంచాయతీగా ఉన్న మధిర క్రమేపీ నగర పంచాయతీగా రూపుదిద్దుకొని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీగా మారింది. ప్రస్తుతం మున్సిపాలిటీలో వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ రూ.30 కోట్లను కేటాయించగా గతంలో రూ.30 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టి అభివృద్ధి చేశారు. వీటితోపాటు చిల్డ్రన్‌పార్క్, రూ.5.70 కోట్లతో మధిర ట్యాంక్‌బండ్, రూ.4.50 కోట్లతో వెజ్ నాన్‌వెజ్ మార్కెట్, ఇటీవల నూతన కోర్టు భవనానికి రూ.30 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులను పూర్తిచేసింది.
ఆహ్లాదకరంగా మారిన పల్లెలు
ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించింది. నియోజకవర్గంలో 185 పల్లె ప్రకృతివనాలను నిర్మించి రూ.32,03,75,000 ఖర్చు చేయడంతో గ్రామాలన్నీ ఆహ్లాదకరంగా మారి ప్రశాంత వాతావరణం నెలకొన్నది.
అండగా నిలిచిన ‘ఆసరా’
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేతివృత్తుల వారికి ‘ఆసరా’ అండగా నిలుస్తున్నది. అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.70 నుంచి రూ.500 మాత్రమే పింఛన్ ఇవ్వడంతో చాలీచాలక ఇబ్బందులకు గురయ్యారు. నేడు తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3,016, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, బోదకాలు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున వారి ఖాతాల్లో ప్రతి నెలా జమ చేస్తున్నది. ఇప్పటివరకు నియోజకవర్గంలో 44,252 మందికి రూ.91 కోట్లను అందించింది.
కొత్త భవనాలు, వాహనాలు
నైజాం ప్రభుత్వంలో నిర్మించిన భవనాల్లో పోలీస్స్టేషన్లు ఉన్నాయి.. పోలీస్ అధికారులు, సిబ్బంది వసతులు లేక అక్కడ ఇబ్బంది పడేవారు.. నేడు బోనకల్లు, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో రూ.50 లక్షల వ్యయంతో ఒక్కొక్క భవనాన్ని నిర్మించి సౌకర్యాలు కల్పించింది. అంతేకాక ఒక్కొక్క పోలీస్‌స్టేషన్‌కు రూ.26 లక్షలతో రెండు కొత్త వాహనాలను ఏర్పాటు చేసింది. దీంతో పోలీస్ వ్యవస్థ మరింతగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.
నెరవేరిన సొంతింటి కల
నాడు కనీసం ఉండేందుకు ఇల్లు లేక, ఉన్న ఇల్లు కూలిపోయే దశలో ఉండి వర్షానికి తడుస్తూ జీవనం సాగించిన పేదల సొంతింటి కల నెరవేరింది. ప్రతి కుటుంబానికి రూ.5.50 లక్షలు నిధులు వెచ్చించి ప్రభుత్వమే సొంతగూడును నిర్మించింది. నియోజకవర్గంలో 779 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి నిరుపేదలకు అందించింది. పట్టాలు ఇచ్చి వారిని గృహప్రవేశాలు చేయించి సొంత ఇంటి కల నెరవేర్చింది. ముదిగొండలో 150, బోనకల్లులో 100, ఎర్రుపాలెం 60, చింతకానిలో 259, మధిరలో 260 ఇళ్లను నిర్మించింది.
మెరుగైన వైద్య సేవలు..
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు, పల్లె, బస్తీ దవాఖాలను ఏర్పాటు చేసింది. నాడు మధిరలో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ ఉన్నప్పటికీ వైద్య సదుపాయాలు మెరుగు పరిచేందుకు రూ.34 కోట్లతో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసి నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చి ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నది.
వైకుంఠాన్ని తలపిస్తున్నవైకుంఠధామాలు
ప్రతి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో వైకుంఠాన్ని మరిపించే విధంగా వైకుంఠధామాలను నిర్మించారు. పిండ ప్రధానం పూజలు చేసేందుకు షెడ్లు, వేచి ఉండేందుకు బల్లలు, స్నానం చేసేందుకు వాటర్ ట్యాంకులను నిర్మించారు. నియోజకవర్గంలో 132 గ్రామాల్లో 146 కోట్ల రూపాయలతో వైకుంఠధామాలను నిర్మించారు.
దళితబంధుతో జీవనోపాధి
దళిత కుటుంబాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేసి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున అందిస్తున్నది. చింతకాని మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద దళితబంధు పథకాన్ని అమలు చేయడంతో 3,462 కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున యూనిట్లు మంజూరయ్యాయి. నియోజకవర్గానికి మరో వంద యూనిట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేయడంతో మధిర మండలంలో 86 యూనిట్లు, ఎర్రుపాలెం మండలంలో 6 యూనిట్లు, ముదిగొండ మండలంలో 5 యూనిట్లు, బోనకల్లు మండలం 3 యూనిట్లు మంజూరు కాగా జిల్లాలోనే అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 3,562 దళితబంధు యూనిట్లకు రూ.356.20 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఆ కుటుంబాలు ఉపాధి పొందుతూ అభివృద్ధిపథంలో పయనిస్తున్నాయి.
రైతుకు వెన్నుదన్నుగా..
రైతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటున్నది. వ్యవసాయాన్ని పండుగ చేసింది. నియోజకవర్గంలో 76,951 మంది రైతులకు రెండు పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ప్రతి ఏడాది రూ.740 కోట్లను రైతుల ఖాతాలో జమ చేస్తున్నది. రైతుబీమా పథకం కింద కుంట భూమి ఉన్న రైతుకు కూడా రూ.5 లక్షలు అందుతున్నాయి. బాధలో ఉన్న కుటుంబాలకు ఈ డబ్బులు భరోసానిస్తున్నాయి. నియోజకవర్గంలోని 979 రైతు కుటుంబాలకు ఇప్పటివరకు రూ.48,95 కోట్ల రైతుబీమా అందింది.
విద్యారంగంపై ప్రత్యేక దృష్టి
ఏనాడో నిర్మించిన పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.. కనీసం తరగతి గదులు లేక చెట్ల కిందనే విద్యాబోధన చేసేవారు.. ఈ పరిస్థితి నేడు పూర్తి మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మన ఊరు/ బస్తీ – మన బడి’ పేరుతో నియోజకవర్గంలో 90 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి కొత్త భవనాలు, మంచినీటి ట్యాంకులు, ల్యాబోరెటరీలు, మరుగుదొడ్ల నిర్మించింది. విద్యాభివృద్ధికి రూ.23 కోట్లను ఖర్చు చేసింది.
కళకళలాడుతున్న చెరువులు
నాడు చెరువులన్నీ పూడుకుపోయి పిచ్చిమొక్కలు, రబ్బరుచెట్లు మొలిచి అధ్వాన్నంగా ఉండేవి. వ్యవసాయం మాట దేవుడెరుగు.. తాగునీటికి కూడా నీళ్లు ఉండేవికావు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పథకం ద్వారా నియోజకవర్గంలోని బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల్లో 122 చెరువులకు రూ.18 కోట్లను వెచ్చించి పూడికతీత, పిచ్చిచెట్లు తొలగించి తూములు, చెరువుకట్టల నిర్మాణాలు చేపట్టింది. దీంతో నాడు వెలవెలబోయిన చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. సాగునీటితోపాటు తాగునీటి సమస్య సైతం పూర్తిగా తొలగిపోయింది.