ప్రాంతం ఏదైనా.. జాతి ఏమైనా.. తెలంగాణ గడ్డపై నివసిస్తున్న ప్రతిఒక్కరినీ ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం.. వారికి సంక్షేమ పథకాలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం.. దీనిలో భాగంగానే దశాబ్దాల క్రితం వలస వచ్చిన గిరి పుత్రులకు ప్రభుత్వం బాసటగా నిలిచింది.. పక్క రాష్ట్రం నుంచి ఎన్నో ఏళ్లక్రితం వలస వచ్చిన గిరిజనులను ఉమ్మడి పాలకులు పట్టించుకోలేదు. వారి సమస్యలను గాలికొదిలేశారు.. ఉండేందుకు గూడు లేదు.. తాగేందుకు నీరు లేదు.. చీకట్లోనే కాలం వెళ్లదీశారు.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఏజెన్సీవాసుల సమస్యలపై దృష్టి సారించారు. ఒక్కొక్కటిగా వారి సమస్యలను పరిష్కరించారు. దీనిలో భాగంగా దుమ్ముగూడెం మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని మానుగట్టకు విద్యుత్ వెలుగులొచ్చాయి.. రేషన్ కార్డు వచ్చింది.. ఆధార్ కార్డుతో జీవనాధారం లభించింది.. మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధజలం సరఫరా అవుతున్నది. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా మానుగట్టకు చేరుతున్నాయి.. దీంతో గిరిజనం స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే గూడెంలో మౌలిక సదుపాయాలు వచ్చాయని గొత్తికోయలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
పర్ణశాల, అక్టోబర్ 30 : దశాబ్దాల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తి కోయలను అక్కున చేర్చుకుంటున్నది రాష్ట్ర ప్రభు త్వం. ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురైన గిరిపుత్రులకు అండగా నిలుస్తున్నది. ఇదే కోవలో దుమ్ముగూడెం మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధిలోని మానుగట్టకు దశాబ్దాల క్రితం గొత్తికోయలు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. నాటి పాలకులు వీరి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గిరిజన గూడెం నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. అనాదిగా వీరు పోడు వ్యవసాయం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సాగుతో పాటు పశువుల పెంపకం, చేపల వేట, అటవీ ఉత్పత్తుల సేకరించి బయటి గ్రామాల్లో విక్రయించడం వీరి జీవనాధారం. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత వీరి జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ ప్రభుత్వం.
చేపట్టిన అభివృద్ధి ఇదీ..
మారుమూల గూడెమైన మానుగట్టలో 37 గొత్తికోయ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గొత్తికోయల దాహార్తి తీర్చేందుకు గ్రామంలో సోలార్ వాటర్ ట్యాంకును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందిస్తున్నది. 2019లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. వైద్యారోగ్యశాఖతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖ తరచూ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నది. వైద్య సిబ్బంది గొత్తికోయలకు వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే మెడిసిన్ అందజేస్తున్నారు. పోలీసులు గ్రామంలోని వీధుల్లో సోలార్ విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ సోలార్ చార్జింగ్ విద్యుద్దీపాలు అందించారు. ఏడాదిలో పలు విడతలుగా దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేస్తున్నారు. గూడెంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదోతరగతి వరకు చదివిన పిల్లలను ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకుంటున్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే గూడెంలో మౌలిక సదుపాయాలు వచ్చాయని గొత్తి కోయలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
ప్రభుత్వం నుంచి లబ్ధి..
గూడెంలో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇప్పించామని, వారందరికీ నెలనెలా ఠంచనుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నిర్మించామని, నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఎంపీడీవో చంద్రమౌళి తెలిపారు. సీఆర్పీఎఫ్, దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో హెల్త్క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, సోలార్ లైట్లు అందిస్తున్నామని సీఐ దోమల రమేశ్ తెలిపారు. ఇక్కడి వలస జీవులను ఆదుకుంటామన్నారు.
గ్రామంలో మౌలిక వసతులు..
ఉమ్మడి రాష్ట్రంలో మేం నిరాదరణకు గురయ్యాం. మాకు తీరని అన్యాయం జరిగింది. అప్పుడు మమ్మల్ని పట్టించుకునే వారే లేరు. తెలంగాణ వచ్చాకే మాకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు వచ్చాయి. మా పిల్లలు చదువుకుంటున్నారు. సోలార్ వాటర్ ట్యాంక్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతున్నది. మౌలిక వసతులు అందుతున్నాయి. అధికారులు, పోలీసులు మాకు అన్నివిధాలా అండగా ఉంటున్నారు.
– ముసికి రాజు, మానుగుట్ట గ్రామస్తుడు