చింతకాని, జూలై 7 : ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ పొలాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధి బృంద సభ్యులు ఆదివారం పరిశీలించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ పొలాన్ని, అక్కడ జరిగిన తవ్వకాలను, మట్టి తరలింపు, బాట తొలగింపు.. తదితర అంశాలను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభాకర్ మృతి అంశంలో కొనసాగుతున్న దర్యాప్తులో డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క తన విశ్వసనీయత నిరూపించుకోవాలని, ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలన్నారు. ప్రభాకర్ పొలం మధ్యలో గాడి కొట్టడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవచూపి ప్రభాకర్ 7 ఎకరాల 10 గుంటలకు హద్దులు నిర్ణయించడంతోపాటు రహదారిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొలం మధ్యలో గండి కొట్టడం హేయమైన చర్య అని, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఏ అండ చూసుకొని దుండగులు గాడి కొట్టారో అందరికీ అర్ధమవుతుందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తరపున ప్రభాకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు, రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, అధికార పార్టీ నాయకులు అక్రమార్కులకు అండగా నిలవడం దుర్మార్గమని విమర్శించారు. తనకు ఎలాంటి న్యాయం జరగదన్న కారణంతోనే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని, కానీ ఆత్మహత్యలే ప్రతి సమస్య పరిష్కారం కావని, రాష్ట్రంలో ఉన్న రైతుల పక్షాన, రైతు సమస్యల పట్ల బీఆర్ఎస్ అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాడుతుందని తెలిపారు.