చింతకాని, ఆగస్టు 3 : దళితబంధు లబ్ధిదారులు తమ యూనిట్లను అమ్మితే గ్రామ ప్రత్యేకాధికారి సైతం బాధ్యత వహించాల్సిందేనని, అమ్మినా, కొన్నా దానిని ప్రభుత్వం నేరంగానే భావిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ‘దళితబంధు పథకం అమలు-పర్యవేక్షణ’ అంశంపై కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌తో కలిసి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకం ద్వారా అందిన, అమ్మిన, గ్రౌండింగ్ కాని, లాభసాటిగా నడుస్తున్న యూనిట్ల పర్యవేక్షణ తదితర అంశాల గురించి గ్రామ ప్రత్యేకాధికారుల నుంచి వివరాలు సేకరించారు.
అలాగే పథకం అమలు తీరుపై పలు అంశాలను భట్టి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా డెయిరీ, గొర్రెల పంపిణీ, పొక్లెయిన్లు, హార్వెస్టర్లు, ట్రాలీ ఆటోలు సైతం కొద్దిస్థాయిలో అమ్మకాలు జరిగినట్లు డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. జీవాలు, పశువులకు ట్యాగ్ ఉన్నా ఎలా అమ్మారని భట్టి ఎదురు ప్రశ్నించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ పశువులు, జీవాలు చనిపోతే ఎందరికి బీమా అందించారో తెలపాలని పశుసంవర్ధక శాఖ అధికారిని వివరణ కోరారు. తన దగ్గర అలాంటి లెక్కలు లేవని అధికారి సమాధానమివ్వడంతో ఆగ్రహం, అసహనానికి గురయ్యారు. దళితబంధు యూనిట్లు అమ్మినా, కొనుగోలు చేసినా వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో మళ్ళీ సమీక్ష నిర్వహిస్తానని, అప్పటిలోగా దళితబంధు లబ్ధిదారులు తమకు కేటాయించిన యూనిట్‌తో వ్యాపారాలు చేసుకునేలా ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు అవగాహన కల్పించాలన్నారు.
మొదటి విడతలో సగంలో మిగిలిన యూనిట్ లాభసాటిగా నడుపుతున్న లబ్ధిదారులను గుర్తించి వారికి మిగతా సగం యూనిట్ అమౌంట్ లేదా చెక్కును వారం రోజుల్లో జరగనున్న సమీక్ష సమావేశంలో అందజేస్తామన్నారు. దళితబంధు పథకం ద్వారా దళితులు వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకోవాలని, యూనిట్లు అమ్మకం, కొనుగోలు జరిపితే చీటింగ్ కేసులకు సైతం ప్రభుత్వం వెనుకాడబోదని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యం, జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిశోర్, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.