బోనకల్లు, మార్చి 27: కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్లు లేనిదే పనులు చేయడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే ఆర్థిక మంత్రి భట్టికి ఉలికిపాటు ఎందుకని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ప్రశ్నించారు. రావినూతల గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమల్‌రాజు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా చెబుతున్నారనే విషయాన్ని అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారన్నారు.
అయితే దీనిపై భట్టి విక్రమార్క కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భట్టి భుజాలు తడుముకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి పెట్టిన ఖర్చులను ఈ ప్రభుత్వం పైసా కూడా చెల్లించడం లేదన్నారు. 200 మంది కాంట్రాక్టర్లు ఏకంగా బిల్లుల కోసం రాష్ట్ర సచివాలయంలో ధర్నా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్‌పై భట్టి చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు.
బిల్లుల కోసం మాజీ సర్పంచ్‌లు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అంటూ అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేయకుండా దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నదని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి రైతులను మరింతగా మోసం చేసిందన్నారు.
మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, మొకజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, లేదంటే ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, కొనకంచి నాగరాజు, వంకాయలపాటి నాగేశ్వరరావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పారా ప్రసాద్, మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర, ఎస్టీ సెల్ అధ్యక్షుడు నూనావత్ సైదా, భూక్య లకియా పాల్గొన్నారు.