చింతకాని, ఆగస్టు 9 : ఉపాధ్యాయులు సాంకేతికతను జోడిస్తూ విద్యార్థులకు బోధించాలని డీఈవో సోమశేఖర శర్మ అన్నారు. చింతకాని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల సముదాయ సమావేశంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్, ఉన్నతి అమలుపై హెచ్ఎంలు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌలిక భాషా గణిత సామర్థ్ధ్యాలను ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాటించాలన్నారు. చిన్నారుల్లో పఠన, అభ్యసనా సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తూ.. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు.
మన ఊరు-మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల తదితర కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయని, విద్యార్థులకు సన్నబియ్యం, రాగిజావ, ఉదయం అల్పాహారం, వారానికి మూడు గుడ్లతో నాణ్యమైన భోజనంతోపాటు శారీరక, మానసిక అంశాలవారీగా బోధన ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారులు రవికుమార్, రామకృష్ణ. ఎంఈవో శ్యాంసన్, కాంప్లెక్స్ హెచ్ఎంలు బీవీ శర్మ, శ్రీనివాసరావు, ఎంఎన్వో శ్రీనివాసరావు, ఆర్పీలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.