ఇల్లెందు/ అశ్వాపురం/ బూర్గంపహాడ్/ దుమ్ముగూడెం/ గుండాల/ మణుగూరు టౌన్, అక్టోబర్ 24: అధ్వానంగా మారిన రహదారులపై ప్రజలు అవస్థలు పడుతూ ప్రయాణించాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా అధ్వానంగా మారిన రోడ్ల గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. ఇప్పటికే ఉన్న గుంతలు వర్షాలతో మరింత ప్రమాదకరంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి.
నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతుండడం.. వాహనదారులు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చేరుతుండడం భద్రాద్రి జిల్లాలో నిత్యకృత్యమైంది. గుంతల రోడ్లపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చేందుకు బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై గుంతలను సందర్శించి, సెల్ఫీలు దిగుతూ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు ఎస్.రంగనాథ్, అబ్దుల్ నబీ, మూలగుండ్ల ఉపేందర్, పాలడుగు రాజశేఖర్, పరికపల్లి రవి తదితరులు దెబ్బతిన్న రోడ్లను సందర్శించి అక్కడ మొక్కలు నాటి నిరసన తెలిపారు.
అశ్వాపురం ప్రధాన రహదారిపై గుంతల్లో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండడంతో అక్కడ బీసీ సెల్ మండల అధ్యక్షుడు భాగవతపు సతీశ్ సెల్ఫీ దిగారు. ఆటో డ్రైవర్లు ఆయనకు మద్దతుగా నిలిచారు. సారపాక నుంచి రెడ్డిపాలెం వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉండడంతో దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని బీఆర్ఎస్ మండల నాయకులు ప్రశ్నించారు. దుమ్ముగూడె మండల కేంద్రంలోని ములకపాడు జంక్షన్లో గుంతల రహదారిని బీఆర్ఎస్ మండల కన్వీనర్ కణితి రాముడు, కో కన్వీనర్ ఎండి.జానీపాషాలు పరిశీలించి, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పర్ణశాల నుంచి తూరుబాక వరకు రోడ్డును మరమ్మతు చేయాలని కోరారు.
గుండాల మండల కేంద్రంలో రోడ్డుపై ఉన్న గుంత వద్ద బీఆర్ఎస్ నాయకులు గడ్డం వీరన్న, తాటి కృష్ణ, పొంబోయిన సుధాకర్, ఈసం సుధాకర్ సెల్ఫీ దిగి నిరసన తెలిపారు. మణుగూరు నుంచి కట్టు మల్లారం, కమలాపురం, రాయిగూడెం వరకు వెళ్లే అంతర్గత ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు ఏనిక ప్రసాద్, వావిలాల నర్సన్న, యశ్వంత్, ప్రసాద్, రవిప్రసాద్, సృజన్ తదితరులు డిమాండ్ చేశారు.