భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. చావు చివరి అంచుల వరకు వెళ్లి రాష్ర్టాన్ని సాధించుకున్న ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ అని, ఆయన చరిత్రను ఎవరూ చెరపలేరని భద్రాద్రి జిల్లా ఇన్చార్జి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. తొలుత నాయకులు తెలంగాణ తల్లికి పూలమాలలు వేశారు. అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం భారీ మోటర్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం దీక్షా దివస్ శిబిరం వద్ద ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ కేంద్రం మెడలు వంచి తెచ్చుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. దేశ చరిత్ర పటంలో తెలంగాణకు ఒక ప్రత్యేకతను తీసుకొచ్చిన చరిత్ర ఆయనదని కొనియాడారు. 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రంలో 33 జిల్లాలను చేసి ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో జరిగినంత అభివృద్ధి జరగలేదన్నారు.
జాతీయ పార్టీలను చూసి ఓట్లు వేసే రోజులుగా పోయాయని, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జుట్టు ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉందని, అందుకే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చతికిలపడ్డారని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో చేసిందేమీ లేక సంబురాలు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అనంతరం ఉద్యమ నాయకులను ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ నాయకులు మంతపురి రాజుగౌడ్, నాగమణి, ప్రకాశ్‌రావు, సిరిమల్లె సత్యనారాయణ, వనమా రాఘవ, అన్వర్‌పాషా, మోదె భాస్కర్, అనుదీప్, హుస్సేన్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. తెలంగాణను మలుపు తిప్పిన చరిత్ర ఆయనది. అలాంటి చరిత్ర దేశంలోనే ఏ నాయకుడికీ లేదు. అందుకే ఆయన దేశానికి ఆదర్శంగా నిలిచిపోయారు. ఆయన ఆనవాళ్లు చెరిపే వారు ఇంకా పుట్టలేదు. రాబోయే రోజులు బీఆర్ఎస్వే. వచ్చే ఎన్నికల్లో వందకు వంద సీట్లు మనమే గెలవబోతున్నాం.
-మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే
6వ తరగతి నుంచే ఉద్యమ చరిత్ర నాది. మాజీ సీఎం కేసీఆర్‌తో వందలసార్లు కలిసి ఉద్యమంలో పాల్గొన్నా. ఏళ్ల తరబడి పోరాటాలు చేసిన ఘనత ఉంది. చరిత్ర పుటల్లో నిలిచిపోయేది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహా వ్యక్తి కేసీఆర్. మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చూడాలనేది అందరి కోరిక.
-దిండిగల రాజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్
కేసీఆర్‌కు పదవి ముఖ్యం కాదు. అందుకే ఎన్నో పదవులను త్యాగం చేశారు. చావు నోట్లో తలపెట్టి మరీ రాష్ర్టాన్ని సాధించారు. కేంద్రం సహకరించకపోయినా నిధులు సమకూర్చుకుని జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించారు. అదే కేసీఆర్ మార్క్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్‌దే విజయం.
-మానే రామకృష్ణ, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి
ఇప్పుడు నాకు 75 ఏళ్లు. మళ్లీ కేసీఆర్ సీఎం అయ్యాకే చనిపోతా. అప్పటి వరకు నేను చావను. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను ఖమ్మం సబ్ జైలులో పెట్టినప్పుడు చూడడానికి వెళితే పోలీసులు రాకుండా అడ్డుకున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఎన్నో నిర్బంధాలు అనుభవించానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని భ్రష్టు పట్టిస్తోందన్నారు.
-తూత నాగమణి, ఉద్యమ నాయకురాలు, దమ్మపేట
ఉద్యమ పోరులో ఢిల్లీ పెద్దలను గడగడలాడించి తెలంగాణను తెచ్చుకున్న దమ్మున్న నేత కేసీఆర్. రాష్ట్రం కోసం ఎన్నో పదవులను తృణప్రాయంగా వదులుకున్నారని, వలసవాదుల నుంచి తెలంగాణ బిడ్డలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో పోరాడి రాష్ర్టాన్ని సాధించారు. అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భద్రాద్రి గుమ్మంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. గులాబీ సైనికులు ఈరోజు ఇంతమంది దీక్షా దివస్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మనతో నడిచిన వారికే టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
కాంగ్రెస్‌లో ఉన్నా అప్పటి టీఆర్ఎస్కు మద్దతు తెలిపి.. ఉద్యమ నేత కేసీఆర్‌ను పరామర్శించడానికి వెళ్లాను. నా కొడుకు రాఘవ నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అలాంటి ఉద్యమ చరిత్ర మాకుంది. పాల్వంచలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక కాలనీకి అప్పట్లోనే కేసీఆర్ నగర్ అని పేరు పెట్టాను. వనమాని నమ్ముకున్న వారికి అన్నీ విజయాలే. వచ్చే ఎన్నికల్లో మాదే విజయం.
-మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు
విద్యార్థి దశ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధన గురించి, కేసీఆర్ చేస్తున్న పోరాటం గురించి తెలుసుకున్నా. కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు నడిపిన నేత. కాంగ్రెస్ సర్కారుకు కూలిపోయే రోజులు దగ్గరపడ్డాయి. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ రావాలి.. కారు పార్టీ గెలవాలి అంటున్నారు. అలాంటి ఉద్యమ పార్టీ మళ్లీ పోరాటం ద్వారానే ప్రభుత్వాన్ని సాధించుకుంటుంది. మళ్లీ కేసీఆర్ సీఎం కావడం తథ్యం.
-బానోతు హరిప్రియానాయక్, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చింది. ఉచిత కరెంటు వట్టిమాటే. మూడు నెలల తర్వాత మళ్లీ బిల్లులు వస్తున్నాయి. ఉద్యమ నాయకుడి భార్యగా నన్ను మాజీ మంత్రి వనమా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేశారు. చాలా మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు వెళ్లిపోయారు. నన్ను దించాలని చూసినా ఏమీ చేయలేక పోయారు.
-కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్