ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 28 : ప్రతి సొసైటీ పరపతేతర వ్యాపారాలు చేసి మంచి లాభాలు గడించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని డీసీసీబీ సమావేశ మందిరంలో 125వ మహాజన సభ చైర్మన్ అధ్యక్షతన శనివారం జరిగింది. తొలుత ఆరు నెలలుగా బ్యాంకు సాధించిన పురోగతి, రాబోయే రోజుల్లో సొసైటీలు, బ్రాంచీల అభివృద్ధికి తీసుకోనున్న చర్యలు, పంట, బంగారు రుణాలు తదితర అంశాలపై ప్రగతి నివేదికను సీఈవో వసంతరావు ప్రజెంటేషన్ చేశారు.
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ నాలుగు జిల్లాల పరిధిలోని 100 సొసైటీలను ప్రగతి పథంలో నిలపాలన్నదే పాలకవర్గం ప్రత్యేక లక్ష్యమని, అందుకోసం కొద్ది నెలల నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీసీసీబీ చేపట్టిన చర్యల ఫలితంగా గత ఏడాదితో పోల్చితే రూ.7 కోట్లు బ్యాంకు వాటాధనం పెరిగిందన్నారు. గత ఏడాది డీసీసీబీ వాటా ధనం రూ.137.95 కోట్లు కాగా.. ప్రస్తుతం రూ.144.97 కోట్లకు చేర్చామన్నారు.
బ్యాంకు అధికారులు, ఉద్యోగుల కృషి ఫలితంగానే డిపాజిట్లు రూ.1,144 కోట్లకు తీసుకొచ్చామన్నారు. డీసీసీబీ ఆధ్వర్యంలో మొత్తం రూ.987.14 కోట్లు వానకాలం పంట రుణాలు ఇచ్చామని తెలిపారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన పలు సొసైటీ చైర్మన్లు, సీఈవోలను సత్కరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, డీసీవో గంగాధర్, డీసీసీబీ పాలకవర్గ సభ్యులు, మార్క్ఫెడ్ ఉమ్మడి జిల్లా మేనేజర్ సునీత, వ్యవసాయ శాఖ కార్యాలయ ఏడీఏ వాణి, సొసైటీల చైర్మన్లు పాల్గొన్నారు.
తమ సొసైటీలలో సగానికి సగం సభ్యులకు కూడా పంట రుణమాఫీ వర్తించలేదని, దీంతో రైతుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సొసైటీ చైర్మన్లు మొరపెట్టుకున్నారు. డీసీసీబీ పరిధిలో మొత్తం రూ.1.69 లక్షల మంది పంట రుణమాఫీకి అర్హత ఉండగా.. ఇప్పటివరకు కేవలం 60 వేల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందని, దీంతో మిగిలిన రైతుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నామని సొసైటీ చైర్మన్లు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బాగం హేమంతరావు, మందడపు సుధాకర్, రాజయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.20 లక్షల పైబడి పంట రుణాలు కలిగిన రైతులకు ప్రభుత్వం తక్షణమే రూ.2 లక్షలు జమ చేసే విధంగా తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీమా గడువు దాటి పక్షం రోజులు కావొస్తున్నా తిరిగి పునరుద్ధరించలేదని, దీంతో ఇటీవల చనిపోయిన రైతులకు ఎవరు పరిహారం చెల్లిస్తారని వారు ప్రశ్నించారు. డీసీసీబీ లాభాలను బ్యాంకు ఉద్యోగులతోపాటు సొసైటీ సిబ్బందికి సైతం వర్తింపజేయాలని, సొసైటీలకు దీర్థకాలిక రుణాలు, బంగారంపై రుణాలు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలని వారు కోరారు. ఎన్పీఏ బకాయిల పట్ల పాలకవర్గం తీసుకుంటున్న చర్యల గురించి సొసైటీ చైర్మన్లకు వివరించాలని వారు డిమాండ్ చేశారు.