ఖమ్మం, జూలై 29: నిన్నామొన్నటి దాకా అద్దంలా మెరిసిన అంతర్గత రహదారులు.. నేడు అడుగుకో గుంతతో ప్రమాదభరితంగా మారాయి. ఆదమరిచి అడుగేస్తే పెద్ద చింతనే తెచ్చిపెట్టేలా ఉన్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో సుందర నగరంగా రూపుదిద్దుకున్న ఖమ్మాన్ని.. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాల బాధ్యులు కూడా వచ్చి చూసి వెళ్లారు. ఇక్కడి రోడ్ల నమూనాను తమ వద్ద కూడా ఇలాంటి రోడ్లను నిర్మించుకున్నారు.
కానీ.. ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల నిర్వహణకు గాలికొదిలేసింది. వర్షాల వల్ల ఎక్కడైనా రోడ్లపై నీళ్లు నిలిస్తే తొలగించే చర్యలు చేపట్టకుండా వాటిని అలా వదిలేసింది. దీంతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఫలితంగా అడుగుకో గుంత పడింది. ఆ మార్గంలో ప్రయాణించే వాహనాలు ధ్వంసమవుతున్నాయి. వాటిపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల భారిన పడుతున్నారు. ఒక్కోసారి కిందపడి గాయాలపాలైన ఘటనలూ ఉన్నాయి. పెద్దపెద్ద గుంతలున్న ఆటోలు, కార్ల వంటి వాహనాలు కూడా ప్రమాదాల భారిన పడుతుండడం గమనార్హం.