దమ్మపేట రూరల్, జూలై 18: నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లతో అసైన్డ్ భూమిని ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా బదలాయించిన ఘటనలో దమ్మపేట తహసీల్దార్ రామ్‌నరేశ్, పెద్దగొల్లగూడెం జీపీవో అనంతమ్మలను భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. దమ్మపేట మండలంలోని పెద్దగొల్లగూడెం రెవెన్యూ గ్రామంలో చిన్నగొల్లగూడెం నివాసి మళ్లా సత్యానికి సర్వే నంబరు 585/54లో 5 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. అయితే, మళ్లా సత్యం మృతిచెందాడని, అతడికి ఒకే సంతానం నామా పుష్పవతి ఉందని పేర్కొంటూ నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించారు.
వాటి ఆధారంగా మళ్లా సత్యం పేరిట ఉన్న ఐదు ఎకరాల భూమిని నామా పుష్పవతి పేరిట బదలాయించారు. అయితే, మళ్లా సత్యం బతికే ఉండడం, అతడికి మరికొంత మంది సంతాన ఉండడం, ఈ విషయం ‘నమస్తే తెలంగాణ’ సహా వివిధ మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసారం అయ్యాయి. ఈ కోవలోనే ముష్టిబండ రెవెన్యూలో సర్వే నంబర్లు 178/ఋ/1/2, 182/1/ ఋ/త/2 లలో 4.01 ఎకరాలను భాగ పంపిణీ పేరుతో పసులులేటి మోహన గంగా భవాని, చిట్ల శారదల నుంచి నల్లగుళ్ల స్వరూపరాణి పేరుతో ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా రికార్డులను మార్పు చేశారు.
ఈ అంశంపై కూడా వివిధ పత్రికల్లో ప్రధాన శీర్షికలు వెలువడ్డాయి. ఈ అక్రమాలపై స్పందించిన భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా కొత్తగూడెం ఆర్డీవో మధును నియమించారు. దీంతో ఆయన ఈ నెల 13న దమ్మపేట తహసీల్‌కు వచ్చారు. ఆ సమయంలో తహసీల్దార్ రామ్‌నరేశ్ సెలవులో ఉన్నారు. 14న కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో మధును తహసీల్దార్ రామ్‌నరేశ్ కలిసి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో సమర్పించిన నివేదిక ఆధారంగా కలెక్టర్ అంకిత్.. దమ్మపేట తహసీల్దార్ రామ్నరేశ్తోపాటు పెద్దగొల్లగూడెం జీపీవో అనంతమ్మలను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని డిప్యూటేషన్‌పై దమ్మపేట తహసీల్దార్‌గా నియమిస్తూ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.