ఎర్రుపాలెం, అక్టోబర్ 24 : పాల వ్యాపారాన్ని విస్తృతం చేస్తూ ఇందిరా మహిళా డెయిరీని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మండల కేంద్రంలోని ఇందిరా మహిళా డెయిరీని గురువారం సందర్శించిన కలెక్టర్.. పాల వ్యాపారం, రోజువారీ అమ్మకాల గురించి మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డెయిరీ నిర్వహణలో ప్రతి అంశాన్ని వ్యాపార దృష్టితో చూడాలని, మంచి లాభాలు వస్తేనే స్వయం సహాయక సంఘాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సంఘ సభ్యులకు ఆదాయం పెంచాలనే ఆలోచనతో సమన్వయంతో పనిచేయాలన్నారు. స్వయం సంఘాల పరిధిలోని పాడి రైతులకు వచ్చే వారం పాల వ్యాపారం, కొవ్వు శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్లో శిక్షణ ఇస్తామన్నారు. విజయవంతంగా వ్యాపారం చేస్తున్న మహిళా సంఘాల అనుభవాలను తెలియజేయాలన్నారు. పాల వ్యాపారంతో ప్రతి మహిళ నెలకు దాదాపు రూ.15 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా సమాఖ్య నుంచి కొందరు సభ్యులను, పాడి రైతులను ఎంపిక చేసి త్వరలోనే గుజరాత్ అమూల్ డెయిరీ పరిశీలనకు పంపిస్తామన్నారు. అక్కడ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద ఏర్పాటు చేసుకున్న వివిధ వ్యాపార యూనిట్ల స్థితిగతుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించామని, ఇంగ్లిష్ మీడియంలో కూడా బోధన జరుగుతున్నదని, తల్లిదండ్రు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కలెక్టర్ మహిళలను కోరారు. కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, తహసీల్దార్ ఉషాశారద, ఇందిరా మహిళా డెయిరీ మేనేజర్ సిద్ధేశ్వర్, ఏపీఎం కే.వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రవీందర్, డీపీఎం డీ.శ్రీనివాస్, ఏపీఎం కే.వెంకటేశ్వర్లు, డెయిరీ పీఎం జే.లక్ష్మణరావు, ఇందిరా డెయిరీ అధ్యక్షురాలు కే.అన్నపూర్ణలలిత, రమణ, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జే.అనిత తదితరులు పాల్గొన్నారు.