ఇల్లెందు, సెప్టెంబర్ 19: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డెయిలీ వైజ్, కాంటింజెంట్ వర్కర్లు ఇల్లెందు పట్టణంలో శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కూర్చొని భిక్షాటన చేస్తూ ముట్టడించారు.
ఈ సందర్భంగా డెయిలీ వైజ్ వర్కర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, హాస్టళ్లలో డెయిలీ వైజ్, కాంటింజెంట్ వర్కర్లు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని, వారికి ఇచ్చే రూ.26 వేల వేతనంను రద్దు చేస్తూ జీవో నెంబర్ 64 ద్వారా వేతన తగ్గింపునకు చర్యలు చేపట్టారని ఆరోపించారు.
చాలీచాలని వేతనాలతో ఏళ్లతరబడి పనిచేస్తున్నా వారిపై ప్రభుత్వం కనికరం చూపడం లేదని, ఉన్నఫళంగా జీతాలు తగ్గిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఆ జీవోను రద్దు చేసి, పాత పద్ధతి ప్రకారమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకుడు నాగేశ్వరరావు, సీఐటీయూ జిల్లా నాయకులు అబ్దుల్ నబి, ఆలేటి కిరణ్కుమార్, శివ, తాళ్లూరి కృష్ణ, భద్రమ్మ, ముత్తయ్య, నాగేశ్వరరావు, స్వామి, మంగ, లక్ష్మణ్, పాపారావు, రఘు, జయ, రామకళ, లాలయ్య, రాజు, నాగులు, స్వరూప, అంజమ్మ, దీప, సుధ, అనిత తదితరులు పాల్గొన్నారు.