అశ్వారావుపేట, జూన్ 13 : గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులపై రేవంత్‌రెడ్డి సర్కార్ డీఎస్ఆర్(డైలీ శానిటేషన్ రిపోర్ట్) యాప్ గుదిబండ మోపింది. పంచాయతీ పాలకవర్గాలు లేక ఒకవైపు, నిధులు మంజూరు కాకపోవడంతో మరోవైపు అప్పుల పాలవుతున్నారు. సుమారు 18 యాప్‌లతో మానసికంగా ఆందోళన చెందుతున్న కార్యదర్శులపై ఇటీవల పారిశుధ్య నిర్వహణకు కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు మరింత భారంగా మారాయి. ఈ మాడ్యూల్ అమలుకు ఉద్యోగులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. దీనిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్‌తోపాటు జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రాలు అందించి సహాయ నిరాకరణ చేపట్టారు.
గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్య నిర్వహణ కోసం డీఎస్ఆర్ యాప్‌ను అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ప్రతిరోజూ పారిశుధ్య నిర్వహణ అనంతరం ఫొటోలతోపాటు వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. అయితే ఈ విధానంతో అదనపు పనిభారం పడుతుందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే యాప్ అమలును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 478 గ్రామ పంచాయతీలు ఉండగా.. సుమారు 40 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి ఇన్చార్జి బాధ్యతలు కూడా పక్క పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది.
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా డైలీ శానిటేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్) యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. దీనిద్వారా పంచాయతీ పరిధిలో ఎన్ని గృహాల నుంచి చెత్త సేకరిస్తున్నారో యాప్‌లో నమోదు చేయాలి. రోజూ మొత్తం ఎన్ని ఇళ్ల నుంచి ఎంత పరిమాణంలో చెత్త సేకరిస్తున్నారో పూర్తి వివరాలు నమోదు చేయాలి. తాజాగా తడి చెత్త, పొడి చెత్త సేకరణ, వీటి విక్రయం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో కూడా నమోదు చేయాలని ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ ‘శ్రమదానం’ మాడ్యూల్ గ్రామ కార్యదర్శులను మరింత పని ఒత్తిడికి గురిచేస్తున్నది. అంతేకాకుండా రోజూ వారీగా చేసే పనులు పడకేస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్య తరుచూ ఉత్పన్నం కానుండడంతో యాప్‌లో వివరాల నమోదుకు తీవ్ర ఆటంకం కలుగుతుందని అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ఈ విషయమై డీపీవో చంద్రమౌళిని వివరణ కోరేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు.
గ్రామ పంచాయతీల నిర్వహణలో కార్యదర్శులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేనన్ని బాధ్యతలు కేవలం పంచాయతీ కార్యదర్శులు మోస్తున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీల నిర్వహణతోపాటు ఓటరు జాబితా సర్వే, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల విచారణ, మిషన్ భగీరథ వంటి అనేక బాధ్యతలతో సుమారు 18 యాప్‌లను నిర్వహిస్తున్నారు. వీటన్నింటితో రోజూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వీటి ఒత్తిడితో అదనంగా పనిభారం పడుతుందని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్యదర్శులు కొత్త మాడ్యూల్లో వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేస్తున్నారు.
యాప్‌లతో క్షేత్రస్థాయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం పని భారం తగ్గించాలి. పాలకవర్గాలతో సంబంధం లేకుండా పంచాయతీలన్నింటికీ క్రమం తప్పకుండా నిధులు విడుదల చేయాలి. నిధులు లేకుండా పంచాయతీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. చెత్తను తూకం వేసి యాప్‌లో వివరాలు నమోదు చేయడం ఇబ్బందితో కూడుకున్న పని. మారుమూల గ్రామాల్లో ఇంటర్ నెట్ సమస్య అధికంగా ఉంటుంది.
– బొమ్మిశెట్టి కిరణ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు, పంచాయతీ కార్యదర్శుల ఫోరం, కొత్తగూడెం
ప్రభుత్వం పంచాయతీల నిర్వహణ, ఇతర పనుల కోసం తీసుకొస్తున్న యాప్‌లతో మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని పనిభారం కార్యదర్శులు మాత్రమే మోస్తున్నారు. పాత అల్లిగూడెం పంచాయతీతోపాటు పేరాయిగూడెం, గుర్రాలచెరువు పంచాయతీల అదనపు బాధ్యతలు నిర్వర్తించాను. ఇటీవల అశ్వారావుపేట మున్సిపాలిటీలో గుర్రాలచెరువు, పేరాయిగూడెం పంచాయతీలు విలీనం కావడంతో కొంత ఉపశమనం కలిగింది.
– కత్తుల స్వాతంత్ర తేజ్, పంచాయతీ కార్యదర్శి, పాత అల్లిగూడెం
గ్రామ పంచాయతీల నిర్వహణకు ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్‌లను రద్దు చేయాలి. పనుల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకవర్గాలు లేక ప్రభుత్వం నుంచి నిధులు విడుదలకాక అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అందుకే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యాప్ అమలును వ్యతిరేకిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్‌తోపాటు డీపీవోకు వినతిపత్రం అందించి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాం.
– ఈస్సంపల్లి వంశీకృష్ణ, జిల్లా కార్యదర్శి, పంచాయితీ కార్యదర్శుల ఫోరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా