అంగన్వాడీ కేంద్రాల్లో శుద్ధజలాలు లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇళ్ల నుంచే నీళ్ల బాటిళ్లను పంపిస్తున్నారు. బాటిళ్లు తెచ్చుకోలేని పిల్లలైతే ఆ చిలుముతో కూడిన నీటినే తాగుతున్నారు. భద్రాద్రి జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో 1,712 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం వీటిల్లో 382 అంగన్వాడీ కేంద్రాలకు భగీరథ నీరు సరఫరా కావడం లేదు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు భగీరథ కనెక్షన్లు ఉన్నా.. ట్యాంకులు పనిచేయని కారణంగా సరఫరా ఉండడం లేదు. దీంతో పక్కనే ఉండే చేతిపంపుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అయితే, కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు మూత్రశాలలకు వెళ్లలేకపోతున్నారు. అక్కడ నీటి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ఇక రానున్న వేసవిలో ఈ అంగన్వాడీల్లో తాగునీటి సమస్య వెంటాడే ప్రమాదం కన్పిస్తోంది.
ప్రతి గ్రామానికీ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. కానీ.. జిల్లాలోని 382 అంగన్వాడీ కేంద్రాలకే నీరు సరఫరా కావడం లేదంటే ఇంకా ఎన్ని గ్రామాలకు నీరు అందడం లేదో అనే విషయం అవగతమవుతోంది. దీంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేతిపంపుల వద్దకు వెళ్లి పంపుకొట్టుకుని మరీ నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. చాతకొండ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ ఉన్నారు. ఆయా లేదు. దీంతో ఆ టీచరే పక్కన ఉన్న పంచాయతీ నర్సరీ వద్దకు వెళ్లి బిందెతో నీళ్లు తెచ్చుకుంటోంది. టేకులపల్లి మండలం బద్దుతండాలో చేతిపంపు నుంచి తెచ్చిన చిలుముతో కూడిన నీటినే పిల్లలు తాగుతున్నారు. సిబ్బంది కూడా అదే నీటితో వంటలు వండుతున్నారు.
అంగన్వాడీ కేంద్రం కట్టిన దగ్గర నుంచి తాగునీరు లేదు. పంచాయతీ వాళ్లు నర్సరీ కోసం వేసిన మోటర్ వద్దకు వెళ్లి బిందెతో నీళ్లు తెచ్చుకుంటున్నాను. మా అంగన్వాడీ కేంద్రంలో ఆయా లేదు. నేనే నీళ్లు తెచ్చుకోవాలి. భగీరథ పైపులైను వేశారు గానీ నీళ్లు రావడం లేదు. మోటరు నీళ్లు తాగలేక ఇక్కడి పిల్లలు వారి ఇళ్ల నుంచి బాటిళ్లు తెచ్చుకుంటున్నారు.
-వజ్జా భారతి, అంగన్వాడీ టీచర్, చాతకొండ
మా అంగన్వాడీ కేంద్రం పక్కన స్కూలు ఉంది. అక్కడి చేతి పంపు దగ్గరకు వెళ్లి బిందెతో నీళ్లు తెస్తున్నా. ఈ చేతి పంపు నీళ్లు చిలుము వాసన వస్తున్నాయి. కానీ.. ఆ నీటినే వినియోగించుకుంటున్నాం. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. పైపు కూడా వెయ్యలేదు. ఎండాకాలం చాలా ఇబ్బందిగా ఉంటది. పిల్లలకు ఎక్కువ నీటి వాడకం ఉంటది.
-బానోత్ మారు, అంగన్వాడీ ఆయా, బద్దుతండా
అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సమస్య లేదు. ఎక్కడైనా ఉంటే పక్కనే ఉన్న పంపుల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నారు. భగీరథ కనెక్షన్లు కూడా ఇచ్చారు. కొన్ని సెంటర్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఇటీవల మిషన్ భగీరథ అధికారులకు తెలియజేశాం. అన్ని కేంద్రాలకూ నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం. మార్చి కల్లా సమస్య పరిష్కారమవుతుంది.
-స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూవో, భద్రాద్రి