రఘునాథపాలెం, జనవరి 17: సమీకృత కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. కలెక్టరేట్ గ్రౌండ్ ఫ్లోర్లో చేసిన ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం స్క్రీనింగ్ టెస్ట్ జరిగిన ఆరుగురు పేషెంట్లతో మాట్లాడారు.
కాగా, వారికి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రుల చేతుల మీదుగా కళ్లజోళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు వారితో మాక్ ప్లాన్ నిర్వహించారు. కంటి వెలుగుపై పేషెంట్ల అభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కలెక్టర్ వీపీ గౌతమ్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి ఉన్నారు.