భద్రాచలం, ఏప్రిల్ 3: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులు రావడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చేరుకోవడంతో రామాలయ వీధులు, పరిసరాలు సందడిగా మారాయి. గురువారం సాయంత్రం నుంచి భక్తుల రాక మొదలు కావడంతో లడ్జీలు, దేవాలయ సత్రాలు, కాటేజీలు నిండిపోయాయి.
శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు చేసి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఉచిత దర్శనంతోపాటు రూ.300 అంతరాలయ అర్చన, రూ.100 శీఘ్ర దర్శన టికెట్ క్యూలైన్లు మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులతో నిండిపోయాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేపట్టారు. కాగా, మార్చి 19వ తేదీ నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో నిలిచిపోయిన నిత్య కల్యాణాలు శుక్రవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.
దీంతో తొలిరోజు 86 జంటలు స్వామివారి కల్యాణంలో పాల్గొన్నాయి. నిత్య కల్యాణ ప్రక్రియలో భాగంగా స్వామివారికి వైదిక బృందం విశ్వక్సేనార్చన, పుణ్యహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు, వేదాశీర్వచనం నిర్వహించారు. కల్యాణం అనంతరం వేడుకల్లో పాల్గొన్న జంటలకు స్వామివారి అంతరాలయ దర్శనం, అన్నదానం కల్పించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం కావడంతో శ్రీసీతారామచంద్ర స్వామివారు స్వర్ణభద్రకవచాలతో భక్తులకు దర్శనమిచ్చారు.