భద్రాద్రి కొత్తగూడెం, జూలై 18 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లాలో లక్షల మంది రైతులు ఉంటే తొలి విడత పేరుతో కేవలం 28,018 మందికే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే మిగతా రైతుల రుణాలన్నీ రెండో, మూడో విడతల్లో మాఫీ అవుతాయని అధికారులు తెలిపారు. నియోజకవర్గాలవారీగా అశ్వారావుపేటలో 7,366, భద్రాచలంలో 4,345, కొత్తగూడెంలో 3,327,
పినపాకలో 7,852, ఇల్లెందులో 3,602, వైరాలో 1,526 మంది రైతులకు చెందిన రూ.లక్షలోపు ఉన్న పంట రుణాలు మాఫీ అయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, జిల్లాలో ఎంతమంది రైతులు రుణమాఫీకి అర్హులు అనే వివరాలను అధికారులు వెల్లడించడం లేదు. అయితే, మొదటి విడతలో ప్రభుత్వం కొందరికే రుణమాఫీ చేయడంతో మిగిలిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకర్లు సరైన సమాధానం చెప్పకపోవడం, వ్యవసాయ అధికారులు జాబితాను గోప్యంగా ఉంచడం వంటి కారణాలతో రైతులు ఆయా రైతువేదికల వద్ద సమాధానాల కోసం ఎదురుచూశారు.