ఖమ్మం రూరల్, జనవరి 8 : కాల్వల్లో ప్రవహించాల్సిన భక్తరామదాసు ప్రాజెక్టు వరద నీరు పంట పొలాలపైకి చేరడంతో సాగు రైతులు ఇబ్బందిపడ్డారు. ఈ ఘటన రూరల్ మండలం చింతపల్లి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు తిరుమలాయపాలెం వద్ద భక్తరామదాసు ప్రాజెక్టుకు సంబంధించిన నీటిని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. అయితే బుధవారం రూరల్ మండలం చింతపల్లి గ్రామ శివారులో యాసంగి పంట పొలాల పైనుంచి భారీగా వరద నీరు ప్రవహించింది.
తిరుమలాయపాలెం మండలం నుంచి రూరల్ మండలానికి వచ్చే శ్రీరాంసాగర్ పాత కాల్వ(20ఎల్ఎల్) ద్వారా నీటిని వదిలారు. కాల్వ మెయింటెనెన్స్ లేకపోవడమా? లేదా ఓవర్ ఫ్లో జరిగిందా? తెలియదు కానీ కాల్వ గట్టుపై నుంచి వరద పంట పొలాల్లోకి చేరింది. అప్రమత్తమైన రైతులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. అప్పటికే చింతపల్లి గ్రామానికి చెందిన వేల్పుల కృష్ణమూర్తి, గొంగటి కృష్ణ తదితర రైతులకు చెందిన యాసంగి వరి నారుమడులు, కూరగాయల తోటలు, వేసిన వరి నాట్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు పేర్కొన్నారు. కనీసం కాల్వ పరిస్థితి చూడకుండా, అంచనాలకు మించి నీటిని ఎలా వదులుతారని రైతులు మండిపడ్డారు.
తిరుమలాయపాలెం, జనవరి 8 : పిండిప్రోలు వద్ద వరద ఉధృతికి ఎస్సారెస్పీ డీబీఎం-60 కెనాల్ ఉప్పొంగి పంట పొలాల్లోకి నీరు చేరింది. అధికారులు పాలేరు రిజర్వాయర్ నుంచి భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీరాంసాగర్ కాల్వల్లోకి నీటిని విడుదల చేశారు. కాల్వల ద్వారా తిరుమలాయపాలెం మండలంలోని చెరువుల్లోకి నీటిని పంపిస్తున్నారు. ఈ క్రమంలో డీబీఎం-60 మెయిన్ కెనాల్, మైనర్ కాల్వల్లో చెట్లను తొలగించి మరమ్మతు చేయకుండానే నీటిని విడుదల చేశారు. దీంతో ఆ నీరంతా పొంగి పత్తి, మిర్చి తోటల్లోకి చేరినట్లు పిండిప్రోలుకు చెందిన రైతు చామకూరి వెంకన్న తెలిపారు. వెంటనే కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.